విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: బీఆరెస్ ఎమ్మెల్యే జోగు రామన్న 15 ఏళ్ల అవినీతి పాలనకు వ్యతిరేకంగా తన భర్త, కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి పోరాటం చేస్తున్నారని కంది సతీమణి సాయి మౌనారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త కంది శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు కంది సాయి మౌనారెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారం పట్టణంలోని 10, 11 వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. కాలనీవాసులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రాంనగర్ కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ హామీల కరపత్రాలు పంచుతూ వాటిపై అవగాహన కల్పించారు. చేతి గుర్తుకు ఓటువేసి గెలిపిస్తే ఆదిలాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తారని భరోసా కల్పించారు. జోగు రామన్న అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకు కంది శ్రీనివాసరెడ్డి కుటుంబంపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. బెదరకుండా తన భర్త ధర్మయుద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమమే ఆయన ముందున్న లక్ష్యమన్నారు. ఒక్కసారి తన భర్త కంది శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ కిసాన్‌సెల్ రాష్ట్ర కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, డేరా కృష్ణారెడ్డి, రమణారెడ్డి, సీపీఐ నాయకులు ముడుపు ప్రభాకర్ రెడ్డి, ముడుపు నళినిరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు శేఖర్, రాజ్ మహ్మద్, రహీమ్, శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్, లత, అమీనా ఖాన్, మహబూబ్, పాషా పాల్గొన్నారు.