KCR । తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ అని బీఆరెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. శనివారం ఆయన ఎర్రవెల్లిలో మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచీ నేటి దాకా పలు సందర్భాల్లో నెహ్రూ సహా ఇందిరాగాంధీ, సోనియాగాంధీ నుంచి నేటిదాకా తెలంగాణకు ద్రోహాలు చేశారంటూ కేసీఆర్ వివరించారు. తెలంగాణను ఆంధ్రలో కలపడం నుంచి, 1969లో వందలాదిమంది బిడ్డలను పొట్టనపెట్టుకోవడం, నీళ్లు నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు దశాబ్దాల కాలంగా జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టారు. ‘తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను మొదటినుంచీ కనీస స్థాయిలో ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసిందనే ఆవేదన, వాళ్ళ తెలివి తక్కువ తనం చూసి, ఉద్యమ కాలంలో నేను వాళ్ళను దద్దమ్మలు సన్నాసులు అని తెలంగాణ సమాజం తరఫున అన్నాను తప్ప, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీదైనా కోపం ఎందుకు ఉంటుంది? అని ప్రశ్నించారు.
తెలంగాణ సంపదపై కన్నేసిన గుంటనక్కలు
తెలంగాణ సంపద మీద అందరూ గుంటనక్కల మాదిరి కన్నేసి ఉన్నారని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు ఉన్న పాలకులు సరిగా చేస్తలేరని, మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలని అంటున్నారని, తెలంగాణలో వచ్చే సారి ఎన్డీఏ కూటమి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నాయని చెప్పారు. తెలంగాణను ఆగం చేయడానికి కొందరు రెడీగా ఉంటారని, అలాంటి వారి పట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు తెలంగాణను ఆగం చేసి కుట్రలను పసిగట్టి కాపాడుకోవాలన్నారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే… ఏకానా కూడా పని కాలేదన్నారు. తెలంగాణ నుంచి మన బీఆరెస్ ప్రతినిధులను పార్లమెంటుకు పంపిస్తే.. కొట్లాడి మన హక్కులు కాపాడుకునేవాళ్లమన్నారు. మన దగ్గర ఎంపీల బలం ఉంటే, కేంద్రం మీద ఒత్తిడి చేసి రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం ఉంటుందని, ఇప్పటికైనా ఈ దిశగా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలన్నారు.