వాయుగుండగా మారనున్న అల్పపీడనం.. బలపడనున్న నైరుతి రుతుపవనాలు

బంగాళా ఖాతాంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా శుక్రవారం నాటికి వాయుగుండంగా మారనుంది. వాయుగుండం శనివారం సాయంత్రానికి తుఫాన్‌గా మారనుందని, దీనికి రేమాల్‌ తుఫాన్‌గా నామకరణం చేసినట్లుగా విశాఖ వాతావరణ శాఖ కేంద్రం డైరెక్టర్‌ సునంద తెలిపారు

  • Publish Date - May 23, 2024 / 04:30 PM IST

పలు రాష్ట్రాల్లో వర్షాలు..తెలుగు రాష్ట్రాల్లో స్వల్పం
బలపడనున్న నైరుతి రుతుపవనాలు

విధాత: బంగాళా ఖాతాంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా శుక్రవారం నాటికి వాయుగుండంగా మారనుంది. వాయుగుండం శనివారం సాయంత్రానికి తుఫాన్‌గా మారనుందని, దీనికి రేమాల్‌ తుఫాన్‌గా నామకరణం చేసినట్లుగా విశాఖ వాతావరణ శాఖ కేంద్రం డైరెక్టర్‌ సునంద తెలిపారు. ఉత్తర బంగాళాఖాతం మీదుగా వాయుగుండం తుఫాన్‌గా మారనుందని తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, ఒడిస్సా రాష్ట్రాలలో భారీ వర్షాలు పడుతాయని, తెలుగు రాష్ట్రాలలో దీని ప్రభావం తక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఏపీలో శుక్రవారం శ్రీకాకుళం , విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడుతాయని వివరించారు.మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపారు.

వాయుగుండంతో బలపడనున్న నైరుతి రుతుపవనాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి ఈ నెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశాలున్నాయని.. 26 నాటికి పశ్చిమ బెంగాల్‌ తీరానికి తుఫాను చేరుతుందని, ఈ కారణంగా బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని సునంద తెలిపారు. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో రుతుపవనాలు విస్తరించాయని, ఈ క్రమంలో తెలంగాణలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.

శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌, హన్మకొండ, జనగామ, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

Latest News