విధాత ప్రత్యేకం: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ కల్లా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు వల్ల ఆగిపోయిన పరీక్షల నిర్వహణ సర్వీస్ కమిషన్ పరిధిలో ఉంటుంది. అది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాబట్టి అందులో ప్రభుత్వ జోక్యం ఉండదు. ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతం, సర్కారు మారిన నేపథ్యంలో చైర్మన్ జనార్దన్‌రెడ్డి, మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. దీనిపై గవర్నర్ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చైర్మన్‌తోపాటు సభ్యులు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసి ఉంటే గవర్నర్ ఇప్పటికే ఆమోదం తెలిపేవారు. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఈ సమస్య ముడిపడి ఉన్నది.
కాబట్టి వారి రాజీనామా ఆమోదంపై గవర్నర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే సర్వీస్ కమిషన్‌లో మరో ఇద్దరు సభ్యులు రాజీనామా చేయడానికి ససేమిరా అంటున్నారు. వీళ్లను తొలిగించే అధికారం కూడా గవర్నర్‌కు ఉండదు. సర్వీస్ కమిషన్ సభ్యులపై ఏమైనా ఆరోపణలు వస్తే వాటి ఆధారంగా వారిని తొలిగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. అలాగే పరీక్ష నిర్వహణ, ఫలితాలు ప్రకటించాలన్నా అది సర్వీస్ కమిషన్ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టు కొత్త బోర్డు ఏర్పాటు చేయాలంటే ఈ సమస్యలన్నీ ఉన్నాయి. అలాగే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సిటింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
జాబ్ క్యాలెండరే ప్రధాన అజెండా
కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పింది. అయితే సర్వీస్ కమిషన్ చైర్మన్, ముగ్గురు సభ్యులు రాజీనామా చేసినప్పటికీ అవి ఆమోదం పొందలేదు కనుక చేశారు కానీ వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు కనుక ప్రస్తుత కమిషన్‌తోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించవచ్చు. జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు పోస్టులు, ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామన్నది స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. అయితే.. జాబ్ క్యాలెండర్ ప్రకటించే ముందే కమిషన్ ప్రక్షాళన, కొత్త కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పకడ్బందీగా తీర్చిదిద్ది, ప్రశ్నపత్రాల లీకేజీ లేకుండా చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారిలతో పాటు ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, అనితా రామచంద్రన్, నదీమ్‌లు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు. పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాలను తెలుసుకున్నారు.
అంతకు ముందు సర్వీస్ కమిషన్ కార్యదర్శి కేరళ రాష్ట్రానికి వెళ్లి అక్కడి సర్వీస్ కమిషన్ విధానాలను అధ్యయనం చేసి వచ్చారు. కేరళ రాష్ట్ర కమిషన్ విధానాలు ఇక్కడ అమలు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ రాష్ట్ర సర్వీస్ కమిషన్‌కు అనుబంధంగా మూడు ప్రాంతీయ కమిషన్ కార్యాలయాలు, 14 జిల్లా కార్యాయాలు కూడా పనిచేస్తాయి. అలాగే అక్కడ రెండేళ్ల తర్వాత రిటైర్ అయ్యే రోజునే కొత్త వ్యక్తి ఉద్యోగంలో చేరేలా నియమాకాలు చేపడుతుంటారు. ఇక్కడ అలాంటి విధానం అమలు చేయడం అంత తేలిక కాదని నిపుణులు చెబుతున్నారు.
కొత్త నోటిఫికేషన్లకు ఇవీ సమస్యలు
ప్రస్తుతం సర్వీస్ కమిషన్ పరిధిలో ఉన్న సుమారు 26 నోటిఫికేషన్లలో 20 వరకు విడుదలయ్యాయి. మిగిలిన వాటిని విడుదల చేయాలంటే మెలిక ఉన్నది. చైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలను ఆమోదించాక, మిగిలిన ఇద్దరిలో ఇద్దరిలో సీనియారిటీ ప్రకారం ఒకరికి ఆ బాధ్యత అప్పగించి, ప్రక్రియను ముందుకు తీసుకెళ్లవచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్రూప్ 1, 2 పోస్టుల సంఖ్య పెంచాలంటే అనుబంధంగా నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేదా ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం కమిషన్‌కు ఉంటుంది. దీనిపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే తర్వాత న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నది. అందుకే ఈ విషయంలో ముందుకు వెళ్లటానికి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఇవన్నీ తాత్కాలికమేనని, త్వరలోనే ఈ సమస్యలన్నీంటికి పరిష్కారం దొరనున్నదని పరిశీలకులు చెబుతున్నారు.
కమిషన్‌లో సిబ్బంది కొరత
కమిషన్‌లో సిబ్బంది కొరత ఉన్నది. సిబ్బంది కొరత వల్ల ఉద్యోగ నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. కమిషన్‌లో మొత్తం 341 సిబ్బంది ఉండాలంటే ప్రస్తుత ప్రభుత్వం మరో 176 పోస్టులను మంజూరు చేసి నియమించాలి. అయితే ఆ నోటిఫికేషన్ కూడా సర్వీస్ కమిషనే ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష కేంద్రాల గుర్తింపు, అభ్యర్థులకు కేంద్రాల కేటాయింపు, ప్రాథమిక, ఫైనల్ కీ వెల్లడి, మూల్యాంకనం, 1:2 నిష్పత్తిలో జాబితా ప్రకటన, తర్వాత ధ్రువీకరణ పత్రాల పరిశీలనలు, న్యాయవివాదాల పరిష్కారం, ఫైనల్ సెలక్షన్ లిస్ట్, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ వంటి పనులన్నీ కమిషన్ చేయాల్సింటుంది. ఈ పనులన్నీ కమిషన్‌లో ఉన్న కొంతమంది సిబ్బందితోనే జరుగుతున్నాయి. అందుకే నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత గత ప్రభుత్వం పరీక్షల నిర్వహణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ పర్యవేక్షణ కోసం ఇతర రాష్ట్రాల సర్వీస్ కమిషన్ తరహాలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సీఈవో) ను నియమించింది. అయితే సీఈవో సంతోష్ బదిలీ అయ్యారు. యూపీఎస్సీ చైర్మన్‌తో సీఎంతో పాటు భేటీ అయిన ముగ్గురు ఐఏఎస్‌లలో ఒకరికి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
పారదర్శకతకే ప్రాధాన్యం
జాబ్ క్యాలెండర్, సర్వీస్ కమిషన్ ప్రక్షాళన, భవిష్యత్తులో నియామక ప్రక్రియలో జాప్యం లేకుండా పారదర్శకంగా తీర్చిదిద్దడానికే ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రానున్న రోజుల్లో ఈ ప్రయత్నాలకు ఎదురవుతున్న అన్నీ సమస్యలను అధిగమించి నిరుద్యోగులు ఎదురుచూస్తున్న నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి నెల చివరి నాటికి దీనిపై స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతున్నది.