డిప్యూటీ సీఎం బట్టి హామీ ఇచ్చారన్న ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు
Pending Bills | ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను త్వరలోనే విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తమ ప్రతినిధి బృందం సభ్యులు డిప్యూటీ సీఎం భట్టిని కలిసి వినతి పత్రం అందజేసినట్లు లచ్చిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను డిప్యూటీ సీఎం కు వివరించామని తెలిపారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులపెండింగ్ బిల్లుల క్లియరెన్స్ తో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ అనివార్యత ను వివరించామన్నారు. తమ వినతిపై సానుకూలంగా స్పందించిన బట్టి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలోనే పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.డిప్యూటీ సీఎం ను కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డితో పాటు డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె. రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, జనరల్ సెక్రటరీ రమేష్ పాక తదితరులు ఉన్నారు.