స్పౌజ్ బదిలీలు జరిపించండి సీఎం రేవంత్‌రెడ్డికి ఉపాధ్యాయుల వినతి

బీఆరెస్ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన 317జీవో కారణంగా వేర్వేరు జిల్లాలకు విసిరేయబడిన ఉపాధ్యాయ దంపతులను ఒకే జిల్లాలకు బదిలీ చేసేందుకు పెండింగ్‌లో ఉన్న13 జిల్లాల స్పౌజ్ బదిలీలు వెంటనే జరిపించి ఆదుకోవాలని మహిళా ఉపాధ్యాయులు సీఎం రేవంత్‌రెడ్డికి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

  • Publish Date - June 2, 2024 / 03:59 PM IST

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన 317జీవో కారణంగా వేర్వేరు జిల్లాలకు విసిరేయబడిన ఉపాధ్యాయ దంపతులను ఒకే జిల్లాలకు బదిలీ చేసేందుకు పెండింగ్‌లో ఉన్న13 జిల్లాల స్పౌజ్ బదిలీలు వెంటనే జరిపించి ఆదుకోవాలని మహిళా ఉపాధ్యాయులు సీఎం రేవంత్‌రెడ్డికి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. మహిళా ఉపాధ్యాయుల బాధలను రాష్ట్ర పెద్దగా, ఒక అన్న గా తొలగించాలని వారు వేడుకున్నారు. బడులు తెరుస్తున్నారంటేనే భయాందోళనకు గురౌతున్నామని, రోజు 100కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చుగాని…200-300కిలోమీటర్లు ప్రయాణాలు చేయలేక, పని చేసే చోట రూములు తీసుకుని కుటుంబాలను విడిచి ఉండలేక మానసిక రుగ్మతలకు లోనయ్యామని వారు వాపోయారు. దయచేసి ఒక్క జిల్లాలో మా ఉపాధ్యాయ దంపతులను పోస్టింగ్ చేయండని, మీ ఋణం తీర్చుకోలేమని, కాని ఋణపడి ఉంటామన్నారు. గతంలో బీఆరెస్ హయాంలో తెచ్చిన 317జీవోతో వేర్వేరు జిల్లాలకు బదిలీయైన ఉపాధ్యాయ దంపతుల నుంచి ఎదురైన నిరసనతో 615మంది వరకు స్పౌజ్ బదిలీలు చేపట్టింది. అయితే మరో 1500వరకు స్పౌజ్ బదిలీలు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఇందుకోసం ఎప్పుడు చర్యలు తీసుకుంటారన్నదానిపై ఎదురుచూపులు పడుతున్నారు.

Latest News