విధాత: తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం, క్యాడర్ అంతా సమిష్టిగా లోక్‌సభ ఎన్నికలకు మిషన్ మోడ్‌లో సన్నద్ధం కావాలని, 17 ఎంపీ స్థానాలు టార్గెట్‌గా పనిచేయాలని పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ పర్యవేక్షణలో రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై చర్చించారు. ఈ నెల 8, 9 తేదీల్లో లోక్‌సభ నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో, 10 నుంచి 12 వరకు ఇన్‌చార్జ్‌లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 20నుంచి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్‌రెడ్డి క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు.
ఆరు గ్యారంటీల అమలుకు ఐదుగురు సభ్యులతో ఇందిరమ్మ గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని, తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలని తీర్మానం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పనిచేసిన మాణిక్ రావు ఠాక్రే అభినందిస్తూ రెండవ తీర్మానాన్ని ఆమోదించారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీకి అభినందనలు తెలుపుతూ మరో తీర్మానం చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీని లోక్‌సభ ఎన్నికల తర్వాత చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
బీఆరెస్, బీజేపీలు తోడు దొంగలు : రేవంత్‌రెడ్డి
బీజేపీ, బీఆరెస్‌లు తోడు దొంగలని, కాళేశ్వరం పేరుతో ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని దోచుకుతిన్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారని విమర్శించారు. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం అవినీతిపై జ్యుడిషియల్ విచారణ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఆనాడు స్వయంగా కాళేశ్వరం అవినీతిపై తాను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఏం చేశారని నిలదీశారు. కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్టుందని, అందుకే కాళేశ్వరంపై ఇప్పుడు సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారని చురకలంటించారు. దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లాపడి బొక్కలు విరిగినా బీఆరెస్‌కు బుద్ధిరాలేదని, నెల రోజులు గడవకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆరెస్ దోచుకుందన్నారు. బీఆరెస్ విమర్శలను కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడే దీటుగా తిప్పికొట్టాలన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని స్పష్టంచేశారు.
కష్టపడివారికి తగిన గుర్తింపు
పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వీలైనంత త్వరగా వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తమదేనని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. 17 లోక్‌సభ స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకుని కనీసం 12 స్థానాలు తగ్గకుండా గెలిపించుకోవాలన్నారు. పీసీసీ విస్తృత స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు లోక్‌సభ సన్నాహక సమావేశాలు సమీక్షలు కొనసాగుతాయన్నారు.
వచ్చే అన్ని ఎన్నికల్లోనూ గెలవాలి : దీపాదాస్ మున్షీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో రానున్న లోక్‌సభ ఎన్నికలు, స్థానిక సంస్థలు సహా అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు పార్టీ నాయకత్వం, క్యాడర్ మరింత టీమ్ వర్క్‌తో పనిచేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ పిలుపునిచ్చారు. తెలంగాణలో అధికార సాధనకు కార్యకర్తలు పదేళ్లు కష్టపడ్డారని అభినందించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి మరింత శ్రమించాలన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌లో బోగస్ ఓట్లు చాలా ఉన్నాయని, నాయకులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలుతో ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతుందన్నారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో కలిసి పనిచేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయన్నారు.