విధాత, హైదరాబాద్ :
తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే వారికోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన సర్కార్.. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. తాజాగా మహిళ స్వయం సహాయక సంఘాలకు కూడా శుభవార్త తెలిపింది. ఈ మహిళ సంఘాలకు రూ.304 కోట్ల వడ్డి లేని రుణాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ఈ నిధులను జమచేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. వీటికి సంబంధించిన చెక్కులను రేపు(మంగళవారం) ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నట్లు సమాచారం.
సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క పాల్గొన్నారు. ములుగు జిల్లా పర్యటనలో ఉన్న సీతక్క.. ఏటూరు నాగారం నుంచి వీసీలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ మహిళ పక్షపాతి అని స్పష్టం చేశారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా వేల కోట్ల రూపాయలను సమకూరుస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ భారం లేకుండా వారికి వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ.3,500 కోట్ల వడ్డీలను ఎగవేసిందని మంత్రి సీతక్క తీవ్ర ఆరోపణలు చేశారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళల పొదుపు సొమ్మును కూడా గత ప్రభుత్వమే కాజేసిందని తీవ్రంగా మండిపడ్డారు. కానీ, ప్రజా ప్రభుత్వం మహిళల సాధికారిత కోసం అనేక ప్రారంభించినట్లు తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతి సంవత్సరం 25 వేల కోట్ల రూపాయలను బ్యాంక్ లింకేజీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సీతక్క వెల్లడించారు.
