Iran Warns Neighbouring Countries After Trump’s Threats: US Bases Will Be Targeted
విధాత ప్రపంచం డెస్క్ | హైదరాబాద్:
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ప్రోత్సహిస్తున్నట్లు మధ్యప్రాచ్యంలో మళ్లీ ఆందోళనలు పెరిగాయి. దాంతో అమెరికా దళాలు ఉన్న ప్రాంతీయ దేశాలకు ఇరాన్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా దాడి చేస్తే కనుక, ఆయా దేశాల్లో ఉన్న అమెరికా బేస్‌లే తమ లక్ష్యమంటూ తెహ్రాన్ ప్రకటించడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి.
అమెరికా దాడి చేస్తే ప్రాంతీయ బేస్‌లే లక్ష్యం: పొరుగు దేశాలకు ఇరాన్ హెచ్చరిక
డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌లో జరుగుతున్న నిరసనల్లో జోక్యం చేసుకుంటామంటూ పలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, తెహ్రాన్ పొరుగుదేశాలకు గట్టిగా హెచ్చరించింది. అమెరికా దళాలకు వసతులు కల్పిస్తున్న సౌదీ అరేబియా, యుఏఈ, టర్కీ వంటి దేశాలకు, వాషింగ్టన్ ఇరాన్‌పై దాడి చేస్తే, మీ దేశాల్లోని అమెరికా బేస్‌లను మేము లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసినట్లు ఒక ఉన్నతస్థాయి ఇరాన్ అధికారి రాయిటర్స్‌కు తెలిపారు.
ALSO READ : ఇరాన్‌లో మారణహోమం.. 12 వేల మంది మృతి..?
ఈ నేపథ్యంలో ఖతార్‌లోని అల్ ఉడైద్ ఎయిర్‌బేస్‌లో ఉన్న కొంతమంది అమెరికా సిబ్బందికి అక్కడి నుంచి వెళ్లిపొమ్మని సూచించినట్లు ముగ్గురు దౌత్యవేత్తలు వెల్లడించారు. అయితే ఇది పెద్దస్థాయి దళాల ఉపసంహరణ కాదని, కేవలం స్థాన మార్పిడి మాత్రమేనని వారు అన్నారు. గతేడాది ఇరాన్ క్షిపణి దాడికి ముందు జరిగినట్లుగా ఈసారి పెద్దగా కదలికలు కనిపించలేదని తెలిపారు.
ట్రంప్ ఇప్పటికే పలు వేదికల్లో, ఇరాన్ నిరసనకారులను హతమార్చితే చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నిరసనకారులు ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని ఆయన పిలుపునివ్వడం కూడా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
అంతర్గత అశాంతి, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య ఇరాన్ టెన్షన్
ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనల్లో ఇప్పటి వరకు 2,400 మందికి పైగా మరణించినట్లు హక్కుల సంస్థ HRANA వెల్లడించింది. దేశంలో ఇంటర్నెట్ నిలిపివేయడంతో సమాచారం బయటకు రావడం కష్టమైందని పశ్చిమ దౌత్యవేత్తలు చెబుతున్నారు. కొంత మేరకు నియంత్రణలోకి వచ్చినా పరిస్థితులు ఇంకా అనిశ్చితిగానే ఉన్నట్లు భావిస్తున్నారు.
ఇదే సమయంలో, అమెరికా–ఇరాన్ మధ్య రహస్యంగా జరగాల్సిఉన్న దౌత్య చర్చలు నిలిచిపోయాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మరియు అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్‌ల మధ్య నేరుగా జరుగుతున్న సంప్రదింపులు సస్పెండ్ అయినట్లు సమాచారం. ఖతార్, యుఏఈ, టర్కీ విదేశాంగ మంత్రులతో ఇరాన్ ఉన్నతాధికారులు మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై తమ ఆందోళనను తెలియజేశారు. ఇరాన్ ప్రజలు తమ సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా జరిగుతున్న అల్లర్లు గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేని రీతిలో భగ్గుమంటున్నాయని పశ్చిమ ప్రాంత అధికారులు చెబుతున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించినా, దేశవ్యాప్తంగా అందోళనల ప్రభావం మాత్రం స్పష్టంగానే కనిపిస్తోంది.
మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడంలేదు. ట్రంప్ అటో ఇటో తేల్చుకోవాలనే కృతనిశ్చయంతో ఉండటంతో, ఇజ్రాయెల్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇరాన్ విదేశాంగ మంత్రి, భారత మంత్రి జైశంకర్‌తో సంభాషించి, ఉద్తిక్తతలు తగ్గించేలా భారత్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.
