Site icon vidhaatha

Governor Jishnu Dev Verma | చారిత్రక వరంగల్ నగరం మరింత సుస్థిరాభివృద్ధి సాధించాలి: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమావేశం

విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ చారిత్రక వారసత్వ నగరం అని, కాకతీయులు పాలించిన సామ్రాజ్యంగా ఈ నగరానికి ఘనమైన చరిత్ర ఉన్నదని, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లాకు సంబంధించి విద్య, వైద్య ఆరోగ్య, ఎంజీఎం ఆసుపత్రి, మహిళ, శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్, వ్యవసాయ, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, ఇతర శాఖలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య జిల్లాలో చారిత్రక దేవాలయాలు, ప్రదేశాలు, పార్కులు, స్మార్ట్ సిటీ, జాతీయ రహదారులు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, విపత్తుల నిర్వహణ సమయంలో, ఇతరత్రా అంశాల కోసం వినియోగిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతిపాదిక కూరగాయల మార్కెట్, విపత్తుల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, బయో మైనింగ్ ప్లాంట్, కాళోజీ కళాక్షేత్రం, తదితర అంశాలతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పై జిల్లా కలెక్టర్ వివరించారు.

అనంతరం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ చారిత్రక వారసత్వ నగరమైన వరంగల్ మరింత సుస్థిరాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వ్యవసాయ రంగంలోనూ జిల్లా ముందుండాలన్నారు. రైతుల ప్రయోజన నిమిత్తం పీఎం కుసుమ్ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినదని, ఈ పథకం ద్వారా సౌర విద్యుత్తు ను వినియోగించుకొనేలా అధికారులు రైతుల్లో చైతన్యం కల్పించాలన్నారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి స్పందిస్తూ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత నిస్తూ, రైతులకు ఉచిత విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మండలి వైస్ ఛైర్మన్ బండా ప్రకాష్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, ఎమ్మెల్సీలు బస్వరాజ్ సారయ్య, తీన్మార్ మల్లన్న, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని, కె.ఆర్ నాగరాజు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version