రాష్ట్ర ఆర్థిక బండి కదలాలంటే.. మోదీ కని­క­రించాల్సిందేనా!

మోదీ క‌ని­క‌­రి­స్తేనే బండి క‌దిలే దారు­ణ‌­మైన ప‌రి­స్థితి రాష్ట్ర ప్ర‌భు­త్వా­నికి ఏర్ప‌­డింది. గ‌త ప్ర‌భుత్వం అందిన కాడికి అప్పులు గుంజు­కొచ్చి ఖ‌ర్చు

  • Publish Date - January 5, 2024 / 02:36 PM IST
  • మూడు క్వార్ట‌ర్లు పూర్తి కాక‌­ముందే
  • ఏడాది కాలం అప్పు చేసిన గ‌త స‌ర్కారు
  • కొత్త అప్పులకోసం దిక్కులు చూస్తున్న రాష్ట్రం
  • 13 వేల కోట్ల‌ రుణా­నికి అను­మ‌తి ఇవ్వండి
  • ప్రధా­నికి విజ్ఞప్తి చేసిన సీఎం రేవం­త్‌­రెడ్డి
  • డిసెం­బ‌­ర్‌లో బాండ్లపై 1400 కోట్లు రుణాలు
  • ఎన్నికలప్పుడు రైతుబంధు జమకు సిద్ధమైన నాటి బీఆరెస్‌ ప్రభుత్వం
  • ఫలితాలు వచ్చేనాటికి ఖజానా ఖాళీ
  • రైతుబంధు నిధులు ఎవరు? ఎవరికి సర్దారు?

విధాత‌, హైద‌­రా­బాద్‌: మోదీ క‌ని­క‌­రి­స్తేనే బండి క‌దిలే దారు­ణ‌­మైన ప‌రి­స్థితి రాష్ట్ర ప్ర‌భు­త్వా­నికి ఏర్ప‌­డింది. గ‌త ప్ర‌భుత్వం అందిన కాడికి అప్పులు గుంజు­కొచ్చి ఖ‌ర్చు చేసి, ఖాజానా అంతా ఊడ్చే­సింది. ఏ రోజుకారోజు చిల్ల‌ర ఖ‌ర్చుకు కూడా వెంప‌­ర్లా­డా­ల్సిన దుస్థితి క‌లి­గింది. కాగ్ విడు­ద‌ల చేసిన న‌వం­బ‌ర్ 30 నాటికి జ‌మా ఖ‌ర్చుల వివ‌­రాలు రాష్ట్ర ఆర్థిక దుస్థి­తికి అద్దం పడుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవ‌­త్స‌­రా­నికి బారో­యింగ్ ద్వారా కానీ, కేంద్రం వ‌ద్ద నేరుగా కానీ క‌లిపి రూ.42,254 కోట్లు రుణం తీసు­కో­వ‌­డా­నికి గ‌త ప్ర‌భుత్వం అసెంబ్లీ అను­మ‌తి తీసు­కు­న్న‌ది. వాస్త‌­వంగా రిజ‌ర్వ్ బ్యాంకు వ‌ద్ద‌ ఏడాది పొడ‌­వునా మార్చి 2024 వ‌ర‌కు మార్కెట్ బారో­యింగ్ అప్పులు రూ.38,234.94 కోట్లు తెచ్చు­కో­వ‌­డా­నికి అను­మ‌తి ఉండ‌గా న‌వం­బ‌ర్ 30 నాటికే రూ.38,151.01 కోట్ల అప్పులు తీసు­కు­న్న‌ది. ఇవి కాకుండా కొద్ది మొత్తంలో కేంద్రం నుంచి రుణం తీసు­కో­వ‌­డా­నికి అను­మ‌తి ఉంది. కాగా ఈ రుణాలు కూడా తీసు­కు­న్న‌ట్లు క‌ని­పిం­చ‌డం లేదు.

ఫలితాల వెల్లడినాటికే ఖజానా ఖాళీ

రాష్ట్ర అసెంబ్లీ ఎన్ని­క‌లు జ‌రు­గు­తున్న త‌రు­ణం­లోనే గ‌త ప్ర‌భుత్వం రూ.4872.67 కోట్లు రిజ‌ర్వ్ బ్యాంకు వ‌ద్ద మార్కెట్ బారో­యింగ్ రుణం తీసు­కు­న్న‌ది. న‌వం­బ‌ర్ 30న పోలింగ్ ముగి­సింది. డిసెం­బ‌ర్ 3వ తేదీన జ‌రి­గిన ఓట్ల లెక్కిం­పులో బీఆ­రెస్ ఓడి కాంగ్రెస్ గెలి­చింది. డిసెం­బ‌ర్ 7న కాంగ్రెస్ పార్టీ అధి­కార ప‌గ్గాలు చేప‌­ట్టింది. తీరాచూస్తే అప్పటికే ఖ‌జానా ఖాళీగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌­టిం­చిన ఆరు గ్యారెం­టీల అమ‌­లుపై మొద‌టి క్యాబి­నె­ట్‌లో తీర్మానం చేసి­న‌­ప్ప‌­టికీ నిధులు వ‌చ్చే మార్గం లేక‌, అప్పులు తెచ్చు­కో­వ‌­డా­నికి ఉన్న అవ‌­కా­శా­ల‌పై కూడా అధి­కా­రులు స‌మా­ధానం చెప్ప‌­లేక పోవ‌­డంతో వెంట‌నే అమ‌లు చేయ‌­లేక పోయారు. న‌గ‌­దును వెంట‌నే చెల్లిం­చా­ల్సిన అవ‌­స‌రం లేని రెండు గ్యారెం­టీలు మ‌హి­ళ‌­ల‌కు ఆర్టీసీ బ‌స్సు­ల‌లో ఉచిత ప్ర‌యాణం, రూ.10 ల‌క్ష‌ల ఆరోగ్య బీమా ప‌థ‌­కా­ల‌ను ప్ర‌క‌­టించి అమ‌లు చేసింది. మిగ‌తా గ్యారెం­టీ­ల‌ను వంద రోజు­ల్లోగా అమ‌లు చేస్తా­మ‌ని ప్ర‌క‌­టిం­చింది.

పథకాలకు నిధులెలా?

కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌­టిం­చిన గ్యారెంటీ ప‌థ‌­కాల అమ‌­లుకు ప్ర‌భుత్వం ద‌ర‌­ఖా­స్తు­ల‌ను స్వీక‌­రి­స్తోంది. కానీ వీటికి ఏవి­ధంగా నిధులు స‌మ‌­కూ­ర్చాలా? అన్నది సీఎం రేవం­త్‌­రె­డ్డికి, ఆర్థిక శాఖ బాధ్య‌­త‌లు నిర్వ‌­హి­స్తున్న డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌­మా­ర్క‌కు స‌వా­ల్‌గా మారింది. వాస్త‌­వంగా డిసెం­బ‌ర్ 9వ తేదీన రైతు బంధు సొమ్ము అంతా రైతుల ఖాతాల్లో ప‌డు­తుం­ద‌ని ఎన్ని­క‌ల్లో రేవం­త్‌­రెడ్డి వాగ్దానం చేశారు. దీనికి ముందు మాజీ అర్థిక శాఖ మంత్రి హ‌రీ­శ్‌­రావు రైతు బంధు డ‌బ్బు­ల‌న్నీ జ‌మ‌­చేసి ఉంచా­మ‌ని, బ్యాంకు ఖాతాలో వేస్తా­మ‌ని ప్ర‌క‌­టిం­చారు. కానీ ఎన్ని­క‌ల త‌రు­వాత చూస్తే ఆ డ‌బ్బు­ల‌న్నీ ఎటు పోయాయో కానీ కొత్త ప్రభుత్వానికి ఖ‌జానా ఖాళీగా దర్శనమిచ్చింది. ముందు­గానే ఫ‌లి­తా­లపై అంచ‌­నాకు వ‌చ్చిన నాటి ప్ర‌భుత్వ పెద్ద‌లు రైతు బంధు కోసం ఉంచిన సొమ్మును త‌మ‌కు అను­కూ­ల‌­మైన కాంట్రా­క్ట‌­ర్ల‌కు చెల్లిం­పులు చేశా­ర‌న్న ఆరో­ప‌­ణ‌లు కూడా విని­పిం­చాయి.


రైతు బంధు కోసం నిల్వ చేసిన డ‌బ్బు ఏమైం­దో­ కానీ సీఎంగా బాధ్య‌­త‌లు తీసు­కున్న రేవంత్ రెడ్డికి ఖ‌జానా మాత్రం ఖాళీ కుండలా ద‌ర్శ‌నం ఇచ్చింది. దీంతో రిజ‌ర్వ్ బ్యాంకు వ‌ద్ద ఏదో చేసి డిసెం­బ‌ర్ నెల‌లో రూ.1400 కోట్లు తీసుకు వ‌చ్చి బండి న‌డి­పిం­చారు. బీఆ­రెస్ స‌ర్కా­రుకు భిన్నంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నెల మొదట్లోనే ఉద్యో­గు­ల‌కు జీతా­లి­చ్చింది. కానీ జ‌న‌­వ‌రి నుంచి మార్చి వ‌ర‌కు బండి న‌డ‌­ప‌­డ‌మే కాదు.. హామీ­ల‌ను అమ‌లు చేయా­ల్సిన బాధ్య‌త ఉంది. అస‌లే పార్ల‌­మెంటు ఎన్ని­క‌లు ముంచుకు వ‌స్తు­న్నాయి. ఎన్ని­క‌ల ముంగిట‌ హామీ­ల‌ను అమ‌లు చేయ‌­క‌­పోతే కాంగ్రెస్ ప్ర‌భు­త్వాన్ని ప్ర‌జ‌లు న‌మ్మ‌ని ప‌రి­స్థితి ఏర్ప‌­డింది. ఇది పార్ల‌­మెంటు ఎన్ని­క‌­ల‌పై తీవ్ర ప్ర‌భా­వా­న్ని­చూపే ప్ర‌మాదం ఉంది. దీంతో ఎలా­గైనా ఈ హామీ­ల‌ను అమ‌లు చేయా­ల‌న్న ల‌క్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని అధికారులు చెబుతున్నారు.


ప్రత్యేక అనుమతుల కోసం వినతి

హామీల అమ‌లు తొలి ప్రాధా­న్యంగా తీసు­కున్న సీఎం రేవంత్ రెడ్డి.. రుణాల కోసం ప్ర‌త్యే­కంగా అను­మ‌­తులు ఇవ్వా­ల‌ని కేంద్రాన్ని కోరారు. ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని రేవంత్ రెడ్డి ప్ర‌త్యే­కంగా క‌లి­శారు. సిద్ధాంతపరంగా వేర్వేరు రాజ‌­కీయ పార్టీ­లై­న‌­ప్ప‌­టికీ తెలం­గాణ ప్ర‌జ‌ల కోసం తమకు అను­మ‌­తి­వ్వా­ల‌ని అడి­గారు. ఈ మేర‌కు జ‌న‌­వ‌రి 9వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వ‌ర‌కు ఏ తేదీన ఎంత మేర‌కు రుణం అవ‌­స‌రం ఉంటుందో తెలి­య‌­జేస్తూ మొత్తం రూ.13 వేల కోట్లు అవ‌­స‌రం అవు­తుం­ద‌ని కేంద్రా­నికి ఇండెం­ట్‌ పె­ట్టారు. ఈ ఇండెంట్ రిజ‌ర్వ్ బ్యాంకు వ‌ద్ద ఉన్న‌ది. దీనికి కేంద్రం అను­మ‌­తిస్తే రేవంత్ రెడ్డి స‌ర్కారుకు నిధుల కొర‌త కొంతమేర తీరు­తుంది. ఇవికాకుండా మ‌రో రూ. 5 వేల కోట్లు ప‌బ్లిక్ అకౌం­ట్‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి కూడా తీసు­కో­వ‌­డా­నికి అవ‌­కాశం ఉంది. ఈ రెండు ర‌కాల అప్పులు క‌లిసి రూ.18 వేల కోట్ల వ‌ర‌కు నిధులు అందు­బా­టు­లోకి వ‌స్తే ప‌థ‌­కాల అమ‌లు సులువు అవు­తుం­ద‌ని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే రాజ‌­కీయ వైరుధ్యాలు పక్కకుపెట్టి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అప్పు­ల‌కు అను­మ‌తి ఇస్తారా? లేదా? అన్న‌ది వేచి చూడాలి.

కేంద్రం వ‌ద్ద రాష్ట్రం పెట్టిన అద‌­న‌పు అప్పుల ఇండెంట్ ఇదే..

తేదీ డ‌బ్బులు (రూ. కోట్ల‌లో)

9 జ‌న‌­వ‌రి రూ.1000

16 జ‌న‌­వ‌రి రూ.2000

30 జ‌న‌­వ‌రి రూ.1000

13 ఫిబ్ర‌­వ‌రి రూ 1000

20 ఫిబ్ర‌­వ‌రి రూ. 1000

27 ఫిబ్ర‌­వ‌రి రూ.1000

5 మార్చి రూ.2000

12 మార్చి రూ.1000

19 మార్చి రూ. 2000

26 మార్చి రూ.1000

మొత్తం రూ.13000