విధాత, హైదరాబాద్: బీఆరెస్ సర్కారు హయాంలో కీలక స్థానాల్లో ఉండి హవా నడిపించిన పలువురు అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వంలో లూప్లైన్లోకి వెళ్లారు. ఉన్నతస్థాయికి చెందిన ఐఏఎస్, ఏపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లలో సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ చూపించారు. ఆర్టీఐ కింద దరఖాస్తు చేయడానికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో నాడు సచివాలయానికి వెళ్లడానికి ప్రయత్నించిన రేవంత్‌రెడ్డిని కలువడానికి నిరాకరించి, సచివాలయం బయటనే పోలీసులతో నిలిపివేయించిన అధికారులు.. ప్రస్తుత బదిలీల్లో అప్రాధాన్య శాఖలకు వెళ్లటం గమనార్హం. బీఆరెస్ హార్డ్‌కోర్ కార్యకర్తలుగా, నాయకులుగా పని చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు అధికారులపైనా వేటు వేసినట్లు కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే మొదట కీలకమైన పోలీస్ అధికారులపై వేటు వేశారు. క్లీన్ ఇమేజ్‌తోపాటు ముక్కుసూటిగా వెళతారనే పేరున్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇదే తీరుగా పలువురు ఐఏఎస్ అధికారులను కీలక విభాగాల్లో నియమించారు. ముఖ్యంగా మృదు స్వభావి, సౌమ్యుడు, ప్రధాని కార్యాలయంలో పని చేసిన అనుభవంతో పాటు రెవెన్యూ అంశాలపై పట్టున్న సీనియర్ ఐఏఎస్ అధికారిగా పేరుపడిన శేషాద్రిని సీఎం కార్యదర్శిగా నియమించుకున్నారు. ఆ తరువాత కేంద్ర సర్వీసులో ఉన్న ఆమ్రపాలిని తెలంగాణకు తీసుకు వచ్చి, హుడాలో పోస్టింగ్ ఇచ్చారు. దీంతో పాటు కీలకమైన విద్యాశాఖను వరంగల్ జిల్లాకు చెందిన బీసీ అధికారి బీ వెంకటేశంకు అప్పగించారు.
అయితే బీఆరెస్ పాలనలో పురపాలకశాఖ బాధ్యతలు నిర్వహించి, ఆనాటి పెద్దలకు తలలోనాలుకలా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న అరవింద్‌కుమార్‌ను డిజిస్టర్కు బదిలీ చేశారు. తాజాగా నాడు సీఎం కార్యదర్శిగా ఒక వెలుగు వెలిగిన స్మితా సబర్వాల్‌ను పెద్దగా ప్రాధాన్యం లేని ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా బదిలీ చేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ నుంచి నేరుగా సీఎం కార్యదర్శిగా వెళ్లిన స్మితా సబర్వాల్ బీఆరెస్ నాయకురాలిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమె వ్యవహార శైలిపై అనేకసార్లు కాంగ్రెస్ పెద్దలు విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె మర్యాపూర్వకంగా కూడా కలువలేదు.
సాగునీటిశాఖ సెక్రటరీగా ఉండి కూడా.. ఆ శాఖపై నిర్వహించిన సమీక్షకు హాజరు కాలేదు. అలాగే రాష్ట్రంలోనే రెవెన్యూపరంగా అత్యంత కీలకమైన జిల్లా అయిన రంగారెడ్డికి కలెక్టర్‌గా పనిచేసిన భారతి హోళికేరిని కూడా ప్రాధాన్యం లేని పురావస్తు శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. భారతి హోళికేరి ఎన్నికల్లో బీఆరెస్‌కు అనుకూలంగా వ్యవహరించారన్న సందేహాల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకే ఆమెను వెంటనే బదిలీ చేసి, జీఏడీకి అటాచ్ చేశారని, ఆ తరువాత ఏమాత్రం ప్రాధాన్యం లేని విభాగానికి పంపారన్న చర్చ జరుగుతోంది.
త్వరలో మరికొందరికి స్థాన చలనం?
తాజాగా 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇచ్చిన సర్కారు.. త్వరలో మరికొంత మందికి స్థానచలనం కలిగించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ముఖ్యంగా బీఆరెస్ పాలనలో సుదీర్ఘకాలంగా పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన జయేశ్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కే రామకృష్ణారావు, ప్రస్తుతం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా, సీసీఎల్ఏగా పనిచేస్తున్న నవీన్ మిట్టల్‌తోపాటు మరికొంత మంది అధికారునూ కూడా బదిలీ చేస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది నాయకులు కూడా వీరిని బదిలీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్టు సమాచారం. ఈ అధికారులు ఆ నాటి ప్రభుత్వంలో కీలకంగా ఉండి, బీఆరెస్‌కు అనుకూలంగా వ్యవహరించారని సీఎంకు ఫిర్యాదు చేశారని తెలిసింది.
ఉన్నతస్థాయి అధికారుల విషయంలో ఆచితూచి నిర్ణయం!
ఉన్నతస్థాయి అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై సీఎం రేవంత్ రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు లేకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న అధికారులను నియమించుకునే పనిలో సీఎం ఉన్నారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.
అదే విధంగా సమర్థులని తాను భావించిన అధికారులను సీఎం ఏరికోరి తన పేషీలో నియమించుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇలా మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కూతురు, ఐఏఎస్ అధికారిణి సంగీతం సత్యనారాయణను తన పేషీలో నియమించారని చెబుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి పాలనపై, అధికారులపై పట్టు సంపాదించుకుంటున్నారని, తద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు సులభంగా, ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది.