– 55 కి.మీ. మేర మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి
– సీఐఐ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ
హైదరాబాద్: సమగ్ర మెగా మాస్టర్ ప్లాన్ రూపొందించి 2050 నాటికి తెలంగాణను పారిశ్రామికంగా గణనీయంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. అందులో భాగంగా 55 కిలోమీటర్ల మేర మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటెన్ డెవలప్మెంట్ అథారిటీకి అప్పగించామని తెలిపారు. గురువారం సీఐఐ తెలంగాణ హైదరాబాద్ లో నిర్వహించిన మౌలిక సదుపాయాలు-రియల్ ఎస్టేట్ సమ్మిట్ లో మంత్రి మాట్లాడారు. ప్రతిపాదిత రివర్ ఫ్రంట్ లో అమ్యూజ్ మెంట్ పార్కులు, జలపాతాలు, వాటర్ స్పోర్ట్స్, వీధి విక్రేత స్థలాలు, వ్యాపార కేంద్రాల వంటి వాటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో షాపింగ్ మాల్స్ కూడా వస్తాయని వివరించారు. ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిద్దాలన్న లక్ష్యంతో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని చేపడుతున్నామని వివరించారు. దీని వల్ల స్థానికులతో పాటు పర్యాటకులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రివర్ ఫ్రంట్ లో భాగంగా వ్యాపార కేంద్రాలు, షాపింగ్ మాల్స్ ఉండడంతో ఆర్థిక అవకాశాలు పెరుగుతాయని, పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. తద్వారా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, వ్యాపారావకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణకు కూడా తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఈ ప్రాజెక్టు ద్వారా పర్యావరణానికి మంచి చేస్తుందన్నారు. పారదర్శకంగా ప్రాజెక్టును చేపట్టడానికి అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఎకో ఫ్రెండ్లీ నిర్మాణం ఉంటుందన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు వల్ల టూరిజం, ఎంటర్ టైన్మెంట్, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని స్పష్టం చేశారు. సంబంధిత రంగాల్లో యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడానికి పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే దిశగా వెళ్తున్నామని చెప్పారు. సమ్మిట్ లో రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దాన కిషోర్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సీ శేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ సాయి డీ ప్రసాద్ పాల్గొన్నారు.