Justice PC Ghosh Report | హైదరాబాద్, ఆగస్ట్ 4 (విధాత) : కాళేశ్వరం ప్రాజెక్టు, బరాజ్‌ల నిర్మాణంలో అవతవకలకు అప్పటి తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుదే బాధ్యత అని వీటిపై విచారణ చేసిన పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. అనేక సంచనల విషయాలను కమిషన్ తన నివేదికలో ప్రస్తావించింది. ‘విధానపరమైన, ఆర్థికపరమైన బరితెగించిన అవకతవకలకు ప్రబలమైన తార్కాణం ఈ ప్రాజెక్టు” అని కమిషన్ అభిప్రాయపడింది. వ్యాప్కోస్ నివేదికను “పక్కనపడేయడానికి” కారకులైన అధికారుల నుంచి (వ్యాప్కోస్‌కు చెల్లించిన) 6.7767 కోట్ల రూపాయలను తిరిగి వసూలు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. “ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ ఏజెన్సీ దురుద్దేశపూర్వకంగా కుమ్మక్కయి అంతర్గతంగా, అనైతికంగా, చట్టవిరుద్ధంగా భారీ ప్రయోజనం పొందడానికి మేడిగడ్డ బరాజ్ నిర్మాణంపై ప్రజాధనాన్నిఅసాధారణ రీతిలో ఖర్చు చేయడంపై” ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని సూచించింది. “తెలంగాణ రాష్ట్రానికి జీవనాడి” కావలసిన ఈ ప్రాజెక్టు వ్యక్తిగత స్థాయిలో నిర్ణయాలు, రాజకీయ నాయకత్వం అసాధారణ జోక్యం, పాలన, ప్రణాళికా, సాంకేతిక పర్యవేక్షణ, ఆర్థిక క్రమశిక్షణ వైఫల్యాల వల్ల ప్రజాధనాన్ని ఘోరంగా వృధా చేసిన ప్రాజెక్టుగా మిగిలిపోయింది అని నివేదిక పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, బరాజ్‌ల నిర్మాణంలో డిజైన్ లోపాల ఆరోపణలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్ పినాకిని ఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఈ ఏడాది జూలై 31న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. 650 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల బృందం అధ్యయనం చేసింది. ఈ రిపోర్టును సోమవారం క్యాబినెట్ సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు.
నిపుణుల కమిటీ నిర్ణయాన్ని పట్టించుకోలేదు
కాళేశ్వరం ప్రాజెక్టు, ఇందులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావుదే నిర్ణయమని కమిషన్ పేర్కొన్నది. ఇందులో ప్రభుత్వ అధికారిక నిర్ణయం లేదని తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని 2015 జనవరి 1న ఏర్పాటు చేశారు. ఈ మేరకు జీవో 28 జారీ చేశారు. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణాన్ని ఈ కమిటీ వ్యతిరేకించింది. వేమనల్లి వద్ద ప్రత్యామ్నాయాలను కమిటీ సూచించింది. కానీ, ఈ ఎక్స్ పర్ట్ కమిటీ సూచనలను అప్పటి సీఎం, ఇరిగేషన్ మంత్రి ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని కమిషన్ తెలిపింది. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్దకు మార్చాలనే ప్రతిపాదన విషయంలో కూడా సరైన కారణం కూడా చూపలేదని రిపోర్ట్ స్పష్టంచేసింది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనే వాదనలో నిజాయతీ లేదని కమిషన్ అభిప్రాయపడింది. ‘మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించి 2016 మార్చి 1న పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు 231, 232, 233 జీవోలు జారీ చేశారు. ఈ విషయాన్ని క్యాబినెట్ ముందుకు తీసుకురాలేదు, ఆమోదించలేదు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం’ అని జస్టిస్ ఘోష్ కమిటీ రిపోర్టు తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు రూ. 71,436 కోట్లు అంటూ 2016 ఫిబ్రవరి 11న ప్రధానికి అప్పటి సీఎం లేఖ రాశారు. అయితే ఈ లేఖ రాసే సమయానికి వ్యాప్కోస్ సంస్థ తుది డీపీఆర్ ఇవ్వలేదని పేర్కొన్నది. వ్యాప్కోస్ తుది డీపీఆర్ ఇవ్వకముందే ఈ లేఖ రాసినట్టు కమిటీ గుర్తించింది.
సీడబ్ల్యూసీ సూచనలు పట్టించుకోలేదు
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు వచ్చే కాంట్రాక్టు సంస్థలకు నిర్మాణం, నిర్వహణను టర్న్ కీ ప్రాతిపదికన ఇవ్వాలని సీడబ్ల్యుసీ సూచించింది. కానీ, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టిందని రిపోర్టు తెలిపింది. వ్యాప్కోస్‌ను సంప్రదించకుండానే 2016 ఆగస్టులో బరాజ్‌ల నిర్మాణాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నారని కమిషన్ తెలిపింది. ఆపరేషన్, నిర్వహణలో నిర్లక్ష్యం, లోటుపాట్లను కూడా కమిటీ ఎత్తి చూపింది. ఈ మూడు బరాజ్‌ల విషయంలో సరైన నిర్వహణ లేని విషయాన్ని కూడా కమిటీ గుర్తించింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలలో బ్యాక్ వాటర్ స్టడీస్, టెయిల్ వాటర్ రేటింగ్, భూమి పరిస్థితులపై అధ్యయనాలు చేయలేదని కమిటీ తేల్చింది. బరాజ్ నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని రిపోర్ట్ బయటపెట్టింది.
అక్రమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసీఆర్ బాధ్యుడు
మూడు బరాజ్‌ల ప్రణాళిక, నిర్మాణం, పూర్తి, నిర్వహణలో జరిగిన అక్రమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అప్పటి సీఎం కేసీఆర్‌దే బాధ్యత అని కమిషన్ అభిప్రాయపడింది. ఈ మూడు బరాజ్‌ల అవకతవకలు, నిర్మాణ లోపాలు, ఇతర అంశాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనదే బాధ్యతగా తేల్చింది. ఈ ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా కిందిస్థాయి వరకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నది. అప్పటి సీఎం కేసీఆర్‌తోపాటు నిపుణుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదని అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు గురించి తెలిపింది. అప్పట్లో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్ధిక అంశాల గురించి తెలియదని వాదించడాన్ని కమిషన్ ప్రస్తావించింది.
అధికారుల తీరును తప్పుబట్టిన పీసీ ఘోష్ కమిషన్
అప్పట్లో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఎస్ కే జోషి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని కమిషన్ తేల్చి చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టడంతో ఈ ప్రాజెక్టు వైఫల్యాలకు ఆయనే బాధ్యుడని కమిటీ తేల్చి చెప్పింది. క్యాబినెట్ ఆమోదం, నిబంధనలు పాటించడంలో వైఫల్యం, నిర్లక్ష్యం, బిజినెస్ రూల్స్ పాటించకపోయినా పట్టించుకోలేదని అప్పట్లో సీఎంవో సెక్రటరీగా పసనిచేసిన స్మితా సభర్వాల్ తీరును గురించి కమిటీ వ్యాఖ్యానించింది. సీడబ్ల్యూసీకి తప్పుడు సమాచారం ఇవ్వడం, దురుద్దేశంతో సవరించిన అంచనాలు ప్రతిపాదించడం, ఆపరేషన్స్, మెయింటనెన్స్ విషయంలో నిర్లక్ష్యానికి అప్పటి ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ బాధ్యుడని రిపోర్ట్ తెలిపింది. అప్పట్లో ఈ ప్రాజెక్టులో పనిచేసిన బీ హరిరామ్, ఎన్ వెంకటేశ్వర్లు, కే సుధాకర్ రెడ్డి, ఓంకార్ సింగ్ నాగేందర్ రావు వంటి అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా కమిషన్ ఎత్తిచూపింది.