హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విధాత ప్రతినిధి):
కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏసీబీ విచారణ కోరడాన్ని పలువురు పలు రకాలుగా అన్వయించుకుంటున్నారు. సీబీఐ విచారణ కోరడానికి ముందు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, తెలంగాణ విజిలెన్స్ కమిషన్ కాళేశ్వరం అక్రమాలపై నివేదికలు ఇచ్చాయి. ఆ తరువాత జస్టిస్ పీసీ ఘోష్ జ్యూడిషియల్ కమిషన్ నివేదిక సమర్పించింది. ఇవన్నీ ఇలా ఉంటే కేంద్ర, రాష్ట్రాల సమస్యలతో కుంభకోణం అంశం ముడిపడి ఉన్నందున ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తునకు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. సీబీఐ విచారణ కోరిన తరువాత మళ్లీ ఏసీబీ విచారణ ఏంటనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల ముడుపుల బాగోతాన్ని బయటకు తీసేందుకే తెలంగాణ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) విచారణ చేయిస్తున్నారని ఒక అధికారి తెలిపారు. దేని విచారణ అది కొనసాగిస్తుందని, ఒకదానికి మరొకటి సంబంధం ఉండదని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు సీబీఐ అధికారులు ఐదారు రోజుల క్రితం సచివాలయంలో అధికారులను కలిసి ఎన్డీఎస్ఏ నివేదిక, ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక వివరాలు సేకరించారు. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన తరువాత పూర్తిగా రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించనున్నారు. సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసే సమయంలో ఏసీబీ విచారణ నివేదికకు ప్రాధాన్యం ఉంటుందని మరో అధికారి పేర్కొన్నారు. ఈ కుంభకోణం నుంచి ఎవరూ తప్పించుకోకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అష్టదిగ్భందం చేస్తోందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
తొలుత విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో మొదలు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బారాజ్ లో పిల్లర్లకు పగుళ్లు, కుంగుబాటు రావడం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ ప్రాజెక్టును విచారణ సంస్థలు, దర్యాప్తు అధికారులు వెంటాడుతున్నారు. ఒకరి తరువాత ఒకరు అన్నట్లు మూడు విచారణలు పూర్తయ్యాయి. మొదటగా తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణ జరిపి, రాష్ట్ర ప్రభుత్వానికి గతేడాది నివేదిక పంపించింది. ఈ నివేదికను పరిశీలించి, అధ్యయనం చేసిన తరువాత నీటి పారుదల శాఖ, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ విజిలెన్స్ కమిషన్ కు సిఫారసు చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులపై ఏ రకమైన చర్యలు తీసుకోవాలో సవివరంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపాలు, నిర్మాణ, నిర్వహణ లోపాలు ఉన్నాయని స్పష్టంగా పేర్కొంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సమర్పించిన నివేదికలో కూడా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దర్యాప్తు నివేదికల ఆధారంగా 57 మంది ఇంజినీరింగ్ అధికారులపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ ఈ ఏడాది మొదట్లో సిఫారసు చేసింది. ఎల్ అండ్ టీ– పీఈఎస్ జాయింట్ వెంచర్ సంస్థ పై క్రిమినల్ కేసు పెట్టాలని సూచించింది.
విజిలెన్స్ కమిషన్ సిఫారసు పై తర్జనభర్జనలు
ఈ సిఫారసుల ప్రకారం చర్యలు తీసుకునే విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊగిసలాడారు. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ జ్యూడిషియల్ కమిషన్ విచారణ జరుగుతున్నందున, చర్యలు తీసుకుంటే నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని తర్జనభర్జనకు గురయ్యారు. జ్యూడిషియల్ కమిషన్ తో సంబంధం లేకుండా బాధ్యులైన ఇంజినీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్ నుంచి డబ్బులు రికవరీ చేయాలని తెలంగాణ విజిలెన్స్ కమిషన్ తన సిఫారసులో స్పష్టం చేసింది. న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు నీటి పారుదల శాఖ ఆదేశం మేరకు ఇంజినీర్ ఇన్ చీఫ్ బాధ్యులైన ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు పంపించింది. మీపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ లేదా డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదో మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఈ ఏడాది జూన్ నెలలో ఇచ్చిన నోటీసులో పేర్కొన్న విషయం తెలిసిందే.
తాజాగా ఏసీబీకి లేఖ
విజిలెన్స్ కమిషన్ నివేదిక ప్రకారం అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు తేలిన అధికారులపై విచారణ జరపాలని నీటి పారుదల శాఖ తాజాగా తెలంగాణ ఏసీబీకి లేఖ రాసింది. ఈ లేఖను పరిశీలించిన ఏసీబీ, అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదదర్శికి వివరాలు పంపించింది. ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి లభించగానే ఏసీబీ రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టనున్నది. విజిలెన్స్ కమిషన్ నివేదిక ప్రకారం సంబంధిత ప్రభుత్వ అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించనున్నారు. ఈ విచారణలో ప్రధానంగా అవినీతి పై ఆధారాలు సేకరించనున్నారు. కాంట్రాక్టర్ల నుంచి ఎవరెవరు లబ్ధిపొందారు? ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది? అనేవి తేల్చనున్నారు. సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసే సమయానికి ఏసీబీ విచారణ పూర్తి చేయనున్నట్లు తెలిసింది. మరో వాదన కూడా విన్పిస్తున్నది, ఒక వేళ సీబీఐ రంగంలోకి దిగకపోతే ఏసీబీ ద్వారా విచారణ పూర్తి చేసి తెలంగాణ సర్కార్ చర్యలకు ఉపక్రమించవచ్చని అంటున్నారు. ముందు జాగ్రత్త లో భాగంగానే ఈ చర్యలు అని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే పలువురు ఈఎన్సీల అరెస్ట్
అయితే ఇప్పటికే ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీలు భూక్యా హరిరామ్, సీ మురళీధర్ రావు, ఈఈ నూనె శ్రీధర్ లను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి నివాసాలు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేసిన సందర్భంగా సుమారు వేయి కోట్ల విలువైన ఆస్తులు, నగదు బయటపడింది. భూక్యా హరిరామ్ కు చెందిన రూ.300 కోట్ల ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే నివ్వెరపోయారు. పదవీ విరమణ తరువాత సీ.మురళీధర్ రావు సుమారు 13 సంవత్సరాల పాటు ఈయన పదవీ కాలాన్ని పొడిగించారంటే పలుకుబడి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.