Site icon vidhaatha

Justice PC Ghose Commission Report | గూగుల్‌ మ్యాపులతో స్థల ఎంపిక! ఆదేశాలన్నీ నాటి సీఎం కేసీఆర్‌వే.. కమిషన్ కనుగొన్న అంశాలు, సమగ్ర సారాంశం

హైదరాబాద్, ఆగస్ట్‌ 31 (విధాత)

Justice PC Ghose Commission Report | తెలంగాణ ప్రభుత్వంలో ఎస్కే జోషి వివిధ హోదాల్లో పనిచేసి ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు (కేఎల్ఐపీ)కు అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అంకురార్పరణ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి (పీసీఎస్ఎస్) ప్రాజెక్టులో అనేక మార్పులు చేర్పుల తరువాత కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుగా రూపాంతరం చెందిందని కాళేశ్వరం జ్యూడిషియల్ కమిషన్‌కు ఎస్కే జోషి వెల్లడించారు. కేసీఆర్ అధ్యక్షతన నిపుణులతో జరిగిన అనేక సమావేశాల్లో గూగుల్ మ్యాపుల సాయంతో పరిశీలించి ప్రాజెక్ట్ స్థలం ఎంపిక, సామర్థ్యం, నిర్మాణాలు ఖరారు అయ్యాయని కమిషన్‌ తేల్చింది. మొత్తంగా కమిషన్‌ కనుగొన్న అంశాలు.. వాటి విస్తృత సారాంశాన్ని గమనిస్తే..

మహారాష్ట్ర, ఏపీ ప్రభుత్వం తో సమావేశాలు
ప్రాజెక్టుకు అడ్డంకిగా ఉన్న సమస్యలను పరిష్కరించించేందు మహారాష్ట్ర, ఏపీలతో చర్చల తరువాత 2015 ఏప్రిల్ 4వ తేదీన జరిగిన సమావేశంలో పూర్తి రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించడానికి ఇతర ఇంజినీరింగ్ అవకాశాలను శోధించాలని నిర్ణయించారు. అయితే మేడిగడ్డ వద్ద బారాజ్ నిర్మాణం చేయాలని 2016 ఆగస్టు 23వ తేదీ నిర్ణయించి, వాస్తవ ముంపు ప్రాంతం ఎంత మేర ఉంటుందనేది చూసి అంతర్ రాష్ట్ర మండలి సమావేశం తరువాత ఎత్తు ఖరారు చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ ఆదేశం మేరకు గోదావరి నదిపై మూడు బారాజ్‌లను నిర్మాణం చేయాలని 2016 మార్చి 1వ తేదీన తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.

హై పవర్ కమిటీ మూడు బారాజ్‌లు నిర్మించాలని సిఫారసు చేసిందా?
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బారాజ్ లు నిర్మాణం చేయాలని హైపవర్ కమిటీ ఎలాంటి సిఫారసు చేయలేదని కాళేశ్వరం కమిషన్ విచారణలో వెల్లడైంది.

నిపుణుల కమిటీ ఈ క్రింది నిర్మాణాలను సిఫార్సు చేసిందా?
తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ వద్ద బారాజ్ ల నిర్మాణంపై నిపుణుల కమిటీ లోతుగా అధ్యయనం చేసిన తరువాత లాభ నష్టాలపై ఒక అంచనాకు వచ్చి, అర్థికంగా ఈ ప్రాంతాలు అంత లాభదాయకం కాదని సూచించింది. మేడిగడ్డ బదులు ప్రాణహిత నదిలో వేమనపల్లి వద్ద నిర్మించడం ఉత్తమం అని నిపుణుల కమిటీ కేసీఆర్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా?
తెలంగాణ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదికను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. మేడిగడ్డ వద్ద బారాజ్ ను నిర్మించాలనే ఏకైక ఉద్ధేశ్యంతో ఈ నివేదికను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచినట్లు కాళేశ్వరం జ్యూడిషియల్ కమిషన్ విచారణలో వెలుగు చూసింది.

రీ ఇంజినీరింగ్ లో భాగంగా మూడు ప్రాంతాల్లో బారాజ్‌లను నిర్మాణం చేయాలని మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేసిందా?
ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓ ఆర్టీ నెంబర్ 655) ప్రకారం ఏర్పాటు చేయబడిన మంత్రివర్గ ఉప సంఘం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీల నిర్మాణాన్ని ప్రతిపాదించలేదు, కనీసం సిఫార్సు కూడా చేయలేదని స్పష్టంగా నిర్ధారితమయ్యింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ రూపొందించిన డీపీఆర్
మేడిగడ్డ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వ్యాప్కోస్ ( కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్) సంస్థకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక ( డీపీఆర్ ) రూపొందించే కన్సల్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తూ 2015 ఏప్రిల్ 15వ తేదీన (జోఓ ఆర్టీ నెంబర్ 212) జారీ చేశారు. కన్సల్టెన్సీ సేవలను అప్పగించడానికి రూ.594.45 లక్షలకు పరిపాలనా ఆమోదం మంజూరు చేశారు. పరిపాలనా ఆమోదం కోసం నోట్ ఫైల్‌ను నీటిపారుదల మంత్రి, ముఖ్యమంత్రి ఆమోదించారు కూడా. దీనికి 2016 జూన్ 3వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశంలో రాటిఫై చేశారు. అయితే రాటిఫికేషన్‌కు ముందు పరిపాలనా అనుమతుల మొత్తాన్ని రూ.677.67 లక్షలకు పెంచుతూ 2016 జనవరి 18న మరో జీవో జారీ చేసిన ఉన్నతాధికారులు దీనికి మంత్రి మండలి ఆమోదం తీసుకోలేదు. ఎల్లంపల్లి – మేడిగడ్డ మధ్యలో రెండు బారాజ్ లు నిర్మాణం చేసేందుకు వీలుగా కన్సల్టెన్సీ బాధ్యతలను వ్యాప్కోస్ కు అప్పగిస్తూ 2016 మార్చి 18న ప్రభుత్వం (జీఓ ఆర్టీ నెంబర్ 323) జారీ చేసింది. వ్యాప్కోస్ ఈ రెండు బారాజ్ లపై డీపీఆర్ ఇచ్చినట్లు ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదు, రికార్డుల్లో ఎక్కడా కూడా కన్పించలేదు. వ్యాప్కోస్ సమర్పించిన పాక్షిక డీపీఆర్‌లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారాజ్ లను నిర్మించాలని పేర్కొని, తుది డీపీఆర్ లో మూడు పవర్ హౌస్ లను నిర్మించాలని సూచించింది. పాక్షిక డీపీఆర్ ప్రకారం ప్రాజెక్టు అంచనాలు తయారు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఐబీఎం కమిటీ 2016 ఫిబ్రవరి 11వ తేదీన సమావేశం నిర్వహించి అంచనాలకు ఆమోదముద్ర వేసింది. తెలంగాణ సచివాలయం బిజినెస్ రూల్స్ ప్రకారం పరిపాలనా అనుమతులు ఇవ్వడం అక్రమం.

బారాజ్ ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులలో లాలూచీ
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బారాజ్ ల నిర్మాణం కోసం 2016 మార్చి 1వ తేదీనే మూడు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అయితే ఈ పరిపాలనా అనుమతులను మంత్రిమండలి సమావేశం ముందు పెట్టి ఆమోదం తీసుకోలేదు. ఆ తరువాత రాటిఫై కూడా చేయలేదు. నీటి పారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కూడబలుక్కుని దీన్ని ఆమోదించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుల కోసం ఎస్పీవీ ఏర్పాటు
కాళేశ్వరం లిప్టు ఇరిగేషన్ స్కీముల కోసం కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ను ఏర్పాటు చేస్తూ నీటిపారుదల శాఖ 2015 అక్టోబర్ 6న ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రధాన లక్ష్యం ఏమంటే ప్రణాళిక రూపొందించడం, అమలు చేయడం, నిధుల విడుదల, అమలు, నిర్వహణ, ఆపరేషన్ విధులు. కానీ బారాజ్‌ల రూపకల్పనలో ఎక్కడా కూడా కాళేశ్వరం కార్పొరేషన్‌ను వ్యాప్కోస్‌తో భాగస్వామ్యం, సమన్వయం చేయలేదు. కార్పొరేషన్‌ను కేవలం నిధుల సమీకరణ, రుణాల సేకరణ, పనులు చేసిన వారికి డబ్బులు చెల్లించే బాధ్యతకే పరిమితం చేశారు.

కర్త, కర్మ, క్రియ కేసీఆర్
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత 2014 జూన్ 2వ తేదీ నుంచి 2016 మార్చి 1వ తేదీ వరకు మూడు బారాజ్ ల నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆర్ తానై వ్యవహరించారు. రీ ఇంజినీరింగ్‌లో భాగంగా ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతిని మార్చి, కాళేశ్వరం ప్రాజెక్టు తెరమీదికి తెచ్చి మూడు బారాజ్‌లను ప్రతిపాదించారు.

మూడు బారాజ్ నిర్మాణానికి సీడబ్ల్యూసీ ఆమోదించిందా?
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) ఫిబ్రవరి 2016లో కేంద్ర జల కమిషన్‌కు సమర్పించారు. అయితే మూడు బరాజ్‌ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు అంతకు ముందే అనగా 2016 మార్చి 1వ తేదీన ఇచ్చారు. ఈ మూడు బారాజ్ ల నిర్మాణానికి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కూడా 2016 జూలై, ఆగస్టు లో కుదుర్చుకోవడం గమనార్హం. కేంద్ర జల సంఘం లేఖలోని సారాంశం ప్రకారం తుమ్మిడి హెట్టి వద్ద బారాజ్ ను నిర్మించకపోతే, మేడిగడ్డ వద్ద నిర్మించుకోవచ్చని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక అంశాలను అధ్యయనం చేస్తోందని, కానీ ఆమోదించలేదని, ఖరారు చేయలేదని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం మార్చి 2018 నాటికి అంచనా వేసి వ్యయంలో రూ. 80190.46 కోట్లలో ఇప్పటికే రూ.30653.72 కోట్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టు పనులు ప్రారంభించిన తరవాతే కేంద్రంలోని పలు విభాగాలు, శాఖల నుంచి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు తీసుకున్నది. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి డీపీఆర్ అనుమతులు తీసుకోకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులివ్వడమే కాకుండా కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకున్నది. సవరించిన ప్రాజెక్టు అంచనాలను ఆమోదించాల్సిందిగా ఎస్.కే.జోషి మంత్రిమండలి ముందు పెట్టగా, 2018 మే 27వ తేదీన ఆమోదించగా, అంతకు ముందే 2018 మే 19వ తేదీన మూడు జీఓలు జారీ చేశారు. సవరించిన అంచనాల మంజూరులో అక్రమాలు జరిగాయి. రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ కూడా ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా ఆమోదించడం విశేషం. నిజాయితీతో వాస్తవికత అంచనాతో సవరించిన అంచనాలు మంత్రి మండలి ముందు పెట్టలేదని జోషి అంగీకరించారు. ముందుగా తయారు చేసిన డీపీఆర్ లో అంచనాలు పద్ధతి ప్రకారం చేయలేదని కమిషన్ ముందు ఆయన నివేదించారు.

Exit mobile version