BRS Family Politics | హైదరాబాద్, ఆగస్ట్ 15 (విధాత): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా వెళుతున్న తన చిన్న కొడుకు ఆర్యకు కేసీఆర్ ఆశీర్వాదం కోసం కవిత ఫామ్ హౌస్‌కు వెళ్లారు. తెలంగాణ జాగృతి ద్వారా కవిత రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఆమె కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాయి. మరో వైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కవిత మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం కూడా ఉంది. ఈ తరుణంలో కేసీఆర్‌తో కవిత భేటీతో ఈ సమస్యలకు తెరపడనుందా అనే చర్చ సాగుతోంది. ఆర్యతో పాటు కవిత కుటుంబసభ్యులతో కేసీఆర్ మాట్లాడారని సమాచారం. 45 నిమిషాల పాటు ఫామ్ హౌస్ లోనే కవిత తన కుటుంబ సభ్యులతో ఉన్నారు. ఫామ్ హౌస్ కు చేరుకున్న కవితను ఆమె తల్లి శోభ ఇంట్లోకి ఆహ్వానించారని తెలిసింది. ఆర్య చదివే యూనివర్శిటీకి సంబంధించిన వివరాలను కేసీఆర్ కు కవిత కుటుంబ సభ్యులు వివరించారు. ఇది పూర్తిగా కుటుంబ పరమైన విషయమేనని చెబుతున్నా.. ఇటీవల జరిగిన ఘటనలు చర్చకు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
గ్యాప్ తగ్గేనా?
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంపై కవిత రాసిన లేఖ మీడియాకు లీక్ కావడంపై తొలిసారిగా కవిత తన మనసులో మాటను బయటపెట్టారు. కేసీఆర్ దేవుడంటూనే ఆయన పక్కన దయ్యాలున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ తర్వాత ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ.. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ కు మరింత గ్యాప్ ను పెంచిందనే చర్చ గులాబీ వర్గాల్లో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో తన రాజకీయ కార్యాచరణకు తెలంగాణ జాగృతిని కవిత వేదికగా చేసుకున్నారు. గతంలో కవిత ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ శ్రేణులు ఆమెతో పాటే ఉండేవారు. కానీ, ఇప్పుడు జాగృతి కార్యకర్తలే ఉంటున్నారు. అంతర్గతంగా మాట్లాడాల్సిన అంశాలు బహిరంగంగా మాట్లాడడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. కవితతో సహా ఎవరైనా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ స్టాండ్ కు భిన్నంగా కవిత వ్యవహరించారు. రిజర్వేషన్ల విషయంలో గులాబీ పార్టీ ఎప్పటికైనా తన దారిలోకి రావాల్సిందేనని కామెంట్స్ చేశారు. తీన్మార్ మల్లన్న కవితపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి శాసనమండలిలో విపక్ష నాయకులు మధుసూధనాచారి మినహా మిగిలిన వారెవరూ స్పందించలేదు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ అగ్రనాయకుడు ఉన్నారని ఆమె ఆరోపణలు చేశారు. ఇటీవల జరిగిన రాఖీ పర్వదినం సందర్భంగా కేటీఆర్ కు రాఖీ కట్టేందుకు వస్తానని కవిత సమాచారం పంపారు. అయితే కేటీఆర్ న్యూఢిల్లీ వెళ్లినందున తాను ఔట్ ఆఫ్ స్టేషన్ అంటూ కవితకు రిప్లై పంపారు. దీంతో కవిత కేటీఆర్ కు రాఖీ కూడా కట్టలేదు. ఇవన్నీ గమనిస్తే కేటీఆర్ తో కవితకు గ్యాప్ పెరిగిందని అర్ధం అవుతోందనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నెల రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు కేసీఆర్ వెళ్లే సమయంలో కవిత ఫామ్ హౌస్ కు వెళ్లారు. అయితే కవితతో కేసీఆర్ మాట్లాడలేదని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ, కేసీఆర్ తో తాను మాట్లాడానని కవిత ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇవాళ కూడా కవిత కేసీఆర్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ భేటీ
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో శుక్రవారం ఉదయం కేసీఆర్ సమావేశం కావాల్సి ఉంది. అయితే కవిత ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. కవిత ఫామ్ హౌస్ లో ఉన్న సమయంలోనే మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా అక్కడికి వచ్చారు. అయితే కేటీఆర్ మినహా ఇతర నాయకులు ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తదితర అంశాలపై కేసీఆర్ పార్టీ నాయకులతో చర్చించారని సమాచారం.