Telangana Surveyors | హైదరాబాద్, జూలై 12 (విధాత): ప్రతి మండలానికి భూ విస్తీర్ణాన్ని బట్టి నలుగురు నుంచి ఆరుగురు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఈనెల 27వ తేదీన శిక్షణ పొందిన లైసెన్స్‌డ్ సర్వేయర్లకు తుది పరీక్ష నిర్వహిస్తామని ఆ తర్వాత 28, 29 తేదీల్లో జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించి ఆగస్టు 12వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. తుది పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 40 రోజుల పాటు అప్రెంటిస్ శిక్షణ ఉంటుందన్నారు. అలాగే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవోను నియమిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసి భూ సమస్యలపై సామాన్యులకు మెరుగైన సేవలందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన సర్వేయర్లను అందుబాటులోకి తీసుకురావలన్న లక్ష్యంతో లైసెన్స్‌డ్ సర్వేయర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించామన్నారు. రెవెన్యూ, సర్వే విభాగానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని సర్వే విభాగం బలోపేతం తోనే రెవెన్యూ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించగలుగుతామని దీనిని దృష్టిలో పెట్టుకొని సర్వేవిభాగాన్ని బలోపేతం చేస్తున్నామని గత పదేళ్ళలో సర్వే విభాగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. రెవెన్యూ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవోను నియమిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం వీఆర్వో, వీఆర్‌ఏలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో అర్హత పరీక్ష నిర్వహించగా 3554 మంది ఎంపికయ్యారని తెలిపారు. మరోసారి అవకాశం కల్పించాలన్న రెవెన్యూ సంఘాల అభ్యర్ధన మేరకు ఈనెల 27న మరోసారి వీరికి అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఐదు నక్షా గ్రామాల్లో రీసర్వే పూర్తి
గత ప్రభుత్వం నక్షా లేని గ్రామాలను గాలికి వదిలేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో నక్షా లేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాలలో ప్రయోగాత్మకంగా రీ సర్వేను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. పైలెట్ గ్రామాలైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలోని సలార్ నగర్‌లో 422 ఎకరాలు, జగిత్యాల్ జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి ( కొత్తది) గ్రామంలో 626 ఎకరాలు, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ లోని 845 ఎకరాలు ,ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురులో 502 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం షాహిద్ నగర్ లో 593 ఎకరాలలో మొత్తం ఐదు గ్రామాలలో 2988 ఎకరాలలో చిన్న వివాదాలకు తావులేకుండా రైతుల సమక్షంలోనే క్షేత్రస్థాయిలో భౌతికంగా ఈసర్వే పూర్తిచేశామన్నారు. దీని వల్ల భూమి సమాచారం, పారదర్శకత, వివాద పరిష్కారం, భూ యాజమాన్యంలో స్పష్టత వస్తుందని ఫలితంగా రైతులు, గ్రామీణ భూ యజమానులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ సర్వే ఫలితాలను పరిగణనలోకి తీసుకొని మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.