Ponguleti Srinivas Reddy : ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్‌, స‌ర్వే విభాగాలు

తెలంగాణలో భూ పరిపాలనను సంస్కరిస్తూ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తెస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. 'భూభారతి' పోర్టల్ ద్వారా జనవరి 2026 నుంచి రైతులకు పూర్తి సమాచారం అందుబాటులోకి రానుంది.

Ponguleti Srinivas Reddy

హైదరాబాద్ : భూ ప‌రిపాల‌న వ్య‌వ‌స్ధ‌ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా వేగ‌వంతంగా అందించ‌డానికి రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్, స‌ర్వే విభాగాలను ఒకే ప్లాట్ ఫామ్ మీదకు తీసుకువచ్చి భూభార‌తి పోర్ట‌ల్ తో అనుసంధానం చేస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రకటించారు. వ‌చ్చే జ‌న‌వ‌రి నెల‌లో ఆధునీక‌రించిన ఈ వ్య‌వ‌స్ధ‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు.

సోమ‌వారం మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి నాంప‌ల్లిలోని సీసీఎల్ఏ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వివిధ విభాగాల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ ప‌రిపాల‌న‌కు కేంద్ర‌మైన సీసీఎల్ఏ కార్యాల‌యం నిర్వ‌హ‌ణ స‌రిగా లేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కార్పొరేట్‌కు ధీటుగా ఆఫీసును ఆధునీక‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వ‌చ్చే నెల‌లో మ‌రోసారి కార్యాల‌యాన్ని త‌నిఖీ చేస్తాన‌ని, అప్ప‌టివ‌ర‌కు కొంత‌మార్పు క‌నిపించాల‌ని అన్నారు. వ‌రుస‌గా విభాగాల వారీగా స‌మీక్షించ‌డం కూడా జ‌రుగుతుంద‌ని ఇందుకు సంబంధించి అధికారుల పూర్తి స‌మాచారంతో సిద్దంగా ఉండాల‌న్నారు.

ద‌శాబ్దాల క్రితం ప్ర‌భుత్వం వివిధ అవ‌స‌రాల కోసం ప్రైవేటు వ్య‌క్తుల నుంచి భూ సేక‌ర‌ణ జ‌రిపింద‌ని, ఇప్ప‌టికీ కొన్ని భూములు ప్రైవేటు వ్య‌క్తుల పేరు మీదే ఉన్నాయ‌ని ఇవ‌న్నీ కూడా రికార్డుల‌లో మార్చాల‌ని, అలాగే అసైన్డ్ , భూధాన్ భూములపై స‌మీక్ష‌తో పాటు కొన్ని సంవ‌త్స‌రాల నుంచి ఉద్యోగుల‌పై విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ఏ విభాగంలో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి, కోర్టు కేసుల‌న్నింటిపై పూర్తిస్ధాయి స‌మీక్ష నిర్వ‌హిస్తాన‌ని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా కొత్త‌గానిర్మించ‌బోయే త‌హ‌శీల్దార్ కార్యాలయాలు ఒకే మోడ‌ల్‌గా ఉండాల‌ని ఇందుకు సంబంధించిన డిజైన్ రూపొందించాల‌ని అధికారుల‌కు సూచించారు. ఒక్క క్లిక్‌తో రైతుకు సంబంధించిన భూముల పూర్తి స‌మాచారం ల‌భించేలా అదేవిధంగా రిజిస్ట్రేష‌న్‌, మ్యుటేష‌న్‌, మార్కెట్ విలువ‌, విలేజ్ మ్యాప్, ప్రతి స‌ర్వే నెంబ‌ర్‌కు మ్యాప్‌, నాలా ఆర్డ‌ర్లు, ఆర్వోఆర్ , గ్రామాల న‌క్షా, ఫీడ్ బ్యాక్ వంటి పూర్తి స‌మాచారం ల‌భించేలా స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ విభాగాల‌తో అనుసంధానం చేస్తూ భూభార‌తి పోర్ట‌ల్‌ను పూర్తి స్ధాయిలో ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌బోతున్నామ‌ని తెలిపారు. ఆధార్ నెంబ‌ర్‌తో అనుసంధాన‌మైన మొబైల్ నెంబ‌ర్ ద్వారా లాగిన్ అయిన వెంట‌నే కావాల్సిన స‌మాచారం ల‌భిస్తుంద‌న్నారు.

క్ర‌య విక్ర‌యదారుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్ర‌తి స‌ర్వే నెంబ‌ర్‌కు మ్యాప్ ను రూపొందించే ప్ర‌క్రియను త్వ‌ర‌లో ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు. రెవెన్యూ వ్య‌వ‌స్ధ ఆధునీక‌రణ చేసే ప్ర‌తిప‌నిలో సామాన్యుని కోణం ఉండాల‌ని ఎలాంటి లోపాల‌కు, తారుమారుకు ఆస్కారం లేకుండా సాఫ్ట్ వేర్‌ను అభివృద్ది ప‌ర‌చాల‌ని సూచించారు. ఈ స‌మావేశంలో రెవెన్యూ కార్య‌ద‌ర్శి డి.ఎస్. లోకేష్ కుమార్‌, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ ఐ.జీ. రాజీవ్ గాంధీ హ‌నుమంతు, సీసీఎల్ఎ ఇన్‌ఛార్జి కార్య‌ద‌ర్శి మంధా మ‌క‌రంద్‌. ఎన్.ఐ.సీ. ఎస్‌.ఐ.ఓ ప్ర‌సాద్‌, విజ‌య్‌మోహ‌న్‌, కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

95 Year Old Sarpanch : పంచాయతీ పాలకుడిగా మాజీ మంత్రి తండ్రి
Doctor Beats Patient | రోగిని చితకబాదిన డాక్టర్..వైరల్ వీడియో

Latest News