GO 111 | త్వరలో భూధార్ కార్డుల పంపిణీ : మంత్రి పొంగులేటి

తెలంగాణ గ్రామాల్లో భూధార్ (Bhoo Adhar) కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సర్పంచ్‌ ఎన్నికల ముగింపు అనంతరం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలకు భూధార్ కార్డులను అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ గ్రామాల్లో భూధార్ (Bhoo Adhar) కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సర్పంచ్‌ ఎన్నికల ముగింపు అనంతరం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలకు భూధార్ కార్డులను అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. మేడ్చల్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. సమగ్ర భూసర్వే పూర్తైన తరువాత అన్ని భూములను రికార్డుల్లోకి ఎక్కించే ప్రక్రియ వేగవంతం అవుతుందనీ, భూముల పట్ల ఏ విధమైన అనుమానాలు లేకుండా రైతులకు పారదర్శకమైన రికార్డులు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

111 జీవో పరిధిలో భూముల వ్యవహారాలపై స్పందించిన పొంగులేటి ప్రభుత్వం పూర్తిగా చట్టబద్ధంగా మాత్రమే వ్యవహరిస్తుందన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటాం అని ఆయన స్పష్టం చేశారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. అన్ని ఆరోపణలు అవాస్తవమని, తనపై కానీ, నా కుటుంబంపై కానీ చేసే ఆరోపణల నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి అని తెలిపారు. కాగా, మంత్రి వ్యాఖ్యలతో భూధార్ కార్డుల పంపిణీపై రైతుల్లో కలిగిన అనుమానాలు తొలగనున్నాయని అధికారులు భావిస్తున్నారు.

Latest News