విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంసిద్దమవుతుంది. తాజాగా ఎన్నికల సంఘం రిజర్వేషన్ల డ్రాఫ్ట్ లిస్ట్ ను ప్రభుత్వానికి అందించింది. రెండు విడతలుగా ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రభుత్వం ఆమోదిస్తే ఈ నెల 25న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈనెల 20నుంచి రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. పంచాయతీ ఎన్నికల తరహాలోనే 50శాతం లోపు రిజర్వేషన్లు ఖరారు చేసి మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం సిద్దమవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ హస్తగతమైన నేపథ్యంలో అదే ఊపులో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 23, 27 తేదీల్లో విడుదల చేసేందుకు ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సమాచారం అందించవచ్చని తెలుస్తుంది. ఇప్పటికే సిద్ధం చేసిన ఓటర్ల జాబితా, మండల, జడ్పీటీసీల లెక్కలు, రిజర్వేషన్లు ప్రభుత్వం వద్ద ఉండడంతో ఇక ఎన్నికలకు వెళ్లడమే తరువాయి అని చెబుతున్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్దంగా ఉంది. రాష్ట్రంలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయా వర్గాల సమాచారం. 2024 జులై 4న జడ్పీటీసీ, 5న ఎంపీటీసీల పదవీకాలం ముగియ్యడంతో ప్రత్యేక పాలన కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి :
Escalator Malfunction : ఎస్కలేటర్ రన్నింగ్..ప్రయాణికుల స్టన్నింగ్
Telangana Speaker Gaddam Prasad : టెన్షన్ టైమ్..నేడే ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు
