విధాత: తెలంగాణలో ఇప్పటివరకు ల్యాండ్ పాలసీ లేదని, ముందుగా పాలసీ వస్తే ఏ భూములు ఏమి చేయాలన్న దానిపై స్పష్టత వస్తుందన్న అభిప్రాయం తెలంగాణ సమాఖ్య చేపట్టిన అసైన్డ్ భూములపై చర్చా వేదికలో వ్యక్తమైంది. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఈ చర్చలో ప్రజాపక్షం ఎడిటర్ , ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు కే శ్రీనివాస్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షుడు కన్నెగంటి రవి, ఆదివాసీ హక్కులపై పనిచేసి వీఎన్వీకే శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సమాఖ్య కరుణాకర్ దేశాయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అసైన్డ్ భూములను అమ్ముకొనే హక్కు కల్పిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై చర్చ జరిగింది. తమకు అసైన్ చేసిన భూములను అసైన్డ్ దారులు పట్టా భూముల మాదిరిగా అవసరానికి అమ్ముకొనే హక్కులు కల్పించాలని కొంతమంది, అలా చేస్తే దళితులకు అసైన్ చేసిన భూములు తిరిగి భూస్వాములుకు, ఇతర పెట్టుబడి దారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
అలా జరిగితే దళితులు తిరిగి భూమి లేని వారు అవుతారు కదా? అన్న సందేహాలు వ్యక్తం చేశారు. కాగా అసైన్డ్ భూములను ప్రభుత్వమే ప్రజా ప్రయోజనాల పేరుతో తిరిగి స్వాధీనం చేసుకొని పరిశ్రమలకని, ఇతర వాటికని కేటాయిపులు చేస్తుందని, దీని ద్వారా కూడా అసైనీలు తీవ్రంగా నష్టపోతున్నారన్న చర్చ జరిగింది. అలాగే పట్టాదారులకు ఉన్న విధంగా అసైనీలకు అమ్ముకొనే హక్కులుంటే భూసేకరణలో పట్టాదారుల మాదిరిగా ప్రయోజనాలు లభిస్తాయని, అసైనీలు తమ పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం అమ్ముకొనే అవకాశం కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే సమయంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు అందుకు వినియోగించక పోతే ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పలువురు కోరారు. పరిశ్రమలకు కేటాయించిన తరువాత అందుకు వినియోగించకుండా తమకు నష్టాలు వచ్చాయన్న పేరుతో ఆ భూముల్లో చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్న అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. వీటిపై అధ్యయనం చేయడం కోసం 15 మందితో మరో కమిటీ వేయాలని తెలంగాణ సమాఖ్య నిర్ణయించింది.