నిషేధిత భూములు ఒక కోటి ఎకరాలు?…సిద్ధం చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం

నిషేధిత భూముల జాబితా రూపకల్పనలో రాష్ట్రంలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై ఉంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు నిషేధిత జాబితా కింద ప్రస్తుతం ఉన్న భూములతో పాటు కొత్తగా చేర్చే వాటితో సవరణ జాబితాను పక్కాగా ప్రకటించనున్నారు.

హైదరాబాద్, విధాత :  నిషేధిత భూముల జాబితా రూపకల్పనలో రాష్ట్రంలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై ఉంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు నిషేధిత జాబితా కింద ప్రస్తుతం ఉన్న భూములతో పాటు కొత్తగా చేర్చే వాటితో సవరణ జాబితాను పక్కాగా ప్రకటించనున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఒక కోటి ఎకరాలకు పైగా నిషేధిత జాబితాలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందులో వక్ఫ్, ఇనామ్, భూదాన్, ఎనిమీ, ఎవాక్యూ, అటవీ, అసైన్డు, ఎండోమెంట్, నీటి పారుదల ప్రాజెక్టు, రోడ్ల కోస సేకరించిన, నివాసాల కోసం ఉపయోగించిన భూములు ఉండనున్నాయి. నవంబర్ నెల మొదటి వారంలో ఈ వివరాలను తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వెబ్ ఫోర్టల్ లో అప్ లోడ్ చేయనున్నారు.
భూముల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత, కచ్చితత్వం కోసం చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆగస్టు 25వ తేదీన రాష్ట్ర రెవెన్యూ శాఖను ఆదేశించింది. తొమ్మిది వారాల్లో నిషేధిత భూముల జాబితాను సరి చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపించాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ నిషేధిత భూముల జాబితాను వెంటనే రూపొందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ముగ్గురితో కమిటీ ని నియమించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించింది. ఈ కమిటీ ఛైర్మన్ గా చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) ఉండగా, రిటైర్డు జడ్జీ ఒకరు, మరొకరు సర్వే అండ్ సెటిల్ మెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి కన్వీనర్ గా ఉన్నారు. వివాదాస్పద భూముల వివరాలపై వచ్చే అప్పీళ్లు, ఫిర్యాదులను ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ణయం తీసుకున్నది. రెవెన్యూ శాఖ ఉత్తర్వుల మేరకు మండల తహశీల్దార్లు సమర్పించిన వివరాల ప్రకారం ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్ (పీఓబీ) లో భూముల వివరాలు చేర్చారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరించిన తరువాత, వాటిని పరిశీలించి తుది జాబితాను దాదాపు సిద్ధం చేసినట్లు తెలిసింది.

తెలంగాణ రిజిస్ట్రేషన్ యాక్టు లోని సెక్షన్ 22-ఏ ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఈ సెక్షన్ క్రింద ప్రకటిస్తే సదరు భూములపై క్రయ విక్రయాలు చేయడానికి అధికారులకు ఎలాంటి అధికారం ఉండదు. ఒక వేళ భూ భారతి ఫోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెళ్లినా అక్కడా వీలు కాదు. వక్ఫ్, ఇనామ్, భూదాన్, ఎనిమీ, అటవీ, అసైన్డు, ఎండోమెంట్, నీటి పారుదల ప్రాజెక్టు, రోడ్లు, నివాసాల కోసం సేకరించిన భూములు సుమారు 77 లక్షల ఎకరాల వరకు ఉన్నాయి. ఇవే కాకుండా మరో 18 లక్షల ఎకరాలు పట్టాదార్ పాస్ పుస్తకాలు లేని వ్యవసాయ భూములు ఉన్నాయి. వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూములుగా (నాలా) మార్పు చేసిన 3 లక్షల ఎకరాలను కూడా నిషేధిత జాబితాలోకి చేర్చారు. ప్రస్తుతం తెలంగాణలో 2.5 కోట్ల ఎకరాలు ఉండగా ఇందులో 1.53 లక్షల ఎకరాల వరకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఇవి పోను మిగతా ఒక కోటి ఎకరాల వరకు నిషేధిత భూముల జాబితాలో ఉండనున్నాయి. ఈ జాబితా ప్రకారం రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ భూములకు పూర్తి రక్షణ ఉండనున్నది.