అందెశ్రీ కొత్త గీతాన్ని తెలంగాణ సమాజం ఆమోదించదు రెడ్డి పేరు లేనందుకే మిగతా వారి పేర్లను తొలగింపచేశారు సీఎం రేవంత్ రెడ్డిపై మంద కృష్ణ మండిపాటు

తెలంగాణ రాష్ట్ర గీతంపై ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. అందెశ్రీ రాసిన గీతాన్ని మార్చి సారం లేకుండా, సందేశం లేకుండా, స్ఫూర్తి లేకుండా చేసి నైతికంగా అందెశ్రీ రాసిన గీతాన్ని చంపేశారని మండిపడ్డారు. కొత్త గీతాన్ని తెలంగాణ సమాజం ఆమోదించదన్నారు

  • Publish Date - June 3, 2024 / 05:21 PM IST

విధాత : తెలంగాణ రాష్ట్ర గీతంపై ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. అందెశ్రీ రాసిన గీతాన్ని మార్చి సారం లేకుండా, సందేశం లేకుండా, స్ఫూర్తి లేకుండా చేసి నైతికంగా అందెశ్రీ రాసిన గీతాన్ని చంపేశారని మండిపడ్డారు. కొత్త గీతాన్ని తెలంగాణ సమాజం ఆమోదించదన్నారు. గీతం నుంచి సమక్క సారక్క, కుమ్రంభీమ్‌, సర్వాయి పాపన్నగౌడ్ పేర్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచర్ల గోపన్న, సోమన్నతో సహా కవుల పేర్లు గీతంలో ఎందుకు తొలిగించారని ప్రశ్నించారు.

అసలు అందెశ్రీ పాట నుంచి ఆయా సామాజిక వర్గాల ప్రముఖుల పేర్లను తొలగించడాన్ని సీతక్క, పొన్నం, శ్రీధర్‌బాబులు ఎలా అంగీకరించారని ప్రశ్నించారు. ప్రజల గుండెల్లో నిలిచిన అందెశ్రీ సంపూర్ణ గత గీతాన్నే ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం అందరం కలిసి పాత గీతాన్నే ఆమోదించేలా ప్రయత్నం చేస్తామని, ఇందుకు కేసీఆర్‌ను కూడా కలిసే ప్రయత్నిం చేస్తానన్నారు. రేవంత్‌ రెడ్డి చెప్పినట్టు విని అందెశ్రీ తన గౌరవాన్ని కోల్పోయారని మందకృష్ణ మాదిగ విమర్శించారు. అందెశ్రీ రాసిన పాటలో స్ఫూర్తిని నింపిన రెడ్డి సామాజిక వర్గం ప్రముఖుడి ప్రస్తావన లేదనే మిగతా కులాల మహానీయుల పేర్లను కూడా తీసేయించారని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి తీసేయమని చెబితే అందెశ్రీ తీసేసి ఉన్న గౌరవం పొగోట్టుకున్నాడన్నారు.రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణాన్ని ఎందుకు తొలగిస్తున్నారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. సమ్మక్క సారక్కను కాకతీయులు చంపితే.. గిరిజనులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్‌ కాదా అని నిలదీశారు. కాకతీయుల ప్రస్తావన రాష్ట్ర గీతంలో ఎందుకు అని ప్రశ్నించారు. చార్మినార్ మన వారసత్వ సంపద అని పేర్కొన్నారు.

 

Latest News