Site icon vidhaatha

Telangana | బీఆరెస్ త్రిమూర్తులకు ఓటర్ల షాక్‌

మెదక్‌లో కేసీఆర్‌, హరీశ్‌లకు, సిరిసిల్లలో కేటీఆర్‌కు ఝలక్‌

విధాత : బీఆరెస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులకు లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ఓటర్లు గట్టి షాక్ నిచ్చారు. రాష్ట్రంలోని 17ఎంపీ స్థానాల్లో ఒక్క సీటు గెలుచుకోలేక చావుదెబ్బ తిన్న బీఆరెస్ పార్టీ, కేవలం రెండు సీట్లలో మాత్రమే రెండో స్థానంలో నిలిచింది.ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి కొంత నిరాశలో ఉన్న బీఆరెస్‌కుకు పార్లమెంట్ ఫలితాలు మరింత నైరాశ్యంలోని నెట్టేశాయి. చివరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిటింగ్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్‌కు అప్పగించేసింది. లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్‌, హరీశ్‌ల జిల్లాల పరిధిలోని లోక్‌సభ స్థానాల్లో ఓటమితో బీఆరెస్ దారుణంగా దెబ్బతింది. మెదక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి హరీష్ రావు, గజ్వేల్ నుంచి కేసీఆర్ విజయం సాధించారు. మెదక్‌ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా 6 నియోజకవర్గాల్లో బీఆరెస్‌ విజయం సాధించింది. ఒక్క మెదక్ అసెంబ్లీలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది.

అయితే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. దుబ్బాక అసెంబ్లీ స్థానంలో బీఆరెస్ చేతిలో ఓడిన బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ప్రజలు విజయాన్ని అందించి, బీఆరెస్‌ను మూడో స్థానానికి పరిమితం చేశారు. దీంతో మెదక్ పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలుగా ఉన్న మామ, అల్లుళ్లకు ఓటర్లు గట్టి ఝలక్ ఇచ్చినట్లయ్యింది. అటు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీఆరెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కూడా బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. లోక్ సభ ఎన్నికల్లో కేటీఆర్ సొంత ఇలాకా అయిన సిరిసిల్ల నియోజకవర్గంలో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక ప్రజలు బీజేపీకే మొగ్గు చూపారు. కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కి 6748 ఓట్ల మెజార్టీ రావడం గమనార్హం.

Exit mobile version