విధాత: కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమ దూరంగా ఉందా? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. అధికారానికి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు దూరంగా ఉంది. అప్పటి నుంచి ఏ ఒక్క సినిమా ప్రముఖుడు కూడా కాంగ్రెస్నాయకులను కలువలేదు. అయితే ఈ ఎన్నికల్లో ప్రజామోదం పొంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సినిమా రంగానికి చెందిన పెద్దలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, బెల్లం కొండ సురేశ్, సీ కళ్యాణ్ లాంటి వాళ్లు విడివిడిగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. దిల్ రాజుతోపాటు పలువురు సినిమా రంగానికి చెందిన నిపుణులు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన పెద్దలంతా విడివిడిగా కలిసిన వారే కానీ ఒక అసోసియేషన్‌గా కలిసిన వారు మాత్రం కాదు. సినిమా నటుల సంఘంగా తెలంగాణలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఉంది. దీనికి అధ్యక్షుడుగా మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు వ్యవహరిస్తున్నారు.
ఎన్నికల తరువాత ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ఆయా సినీరంగాలకు చెందిన అసోసియేషన్ల పెద్దలు సీఎంను, కొత్త ప్రభుత్వ నేతలను కలవడం కర్టసీగా వస్తున్నది. కానీ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కానీ, కార్యవర్గ సభ్యులు కానీ సీఎం రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసే ప్రయత్నం చేసినట్లు లేదు. కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వాన్ని కలువడం ఈ అసోసియేషన్ పెద్దలకు ఇష్టం లేదా? లేక ప్రభుత్వ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? అన్న చర్చ సినీరంగంలో జరుగుతోంది. సహజంగా సీఎం రేవంత్‌రెడ్డి.. అడిగిన వారందరికీ సమయం ఇచ్చి కలుస్తున్నారన్న అభిప్రాయం ఉన్నది. కానీ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన మూవీ అసోసియేషన్ అధ్యక్షులు, ఇతర కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలువకపోవడంపై సినిమా వర్గాలు, రాజకీయ వర్గాలలో తలోమాట అనుకుంటున్నారు. సినిమా పరిశ్రమలో వర్గాలున్నాయా? అసోసియేషన్ పెద్దలు రాజకీయంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. అసోసియేషన్ పెద్దలతో పాటు మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కనీసంగా కలువక పోవడం పట్ల సిని, రాజకీయ వర్గాలో విస్త్రృతంగా చర్చ జరుగుతోంది.