TG Rains | రాగల నాలుగురోజులు పాటు తెలంగాణ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉందని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో వానలుపడే సూచనలున్నాయని తెలిపింది.
బుధవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసిన వాతావరణ శాఖ.. అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్ద నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా దహెగాంలో అత్యధికంగా 137 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. నిజామాబాద్ జానకంపేటలో 123, యెడపల్లెలో 126 మిల్లీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది.