TGSRTC | హైదరాబాద్ : జనవరి 28 నుంచి జరుగబోయే మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులను సురక్షితంగా మేడారం జాతరకు తరలించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మేడారం జాతర జనవరి 28న ప్రారంభమై 31వ తేదీన ముగియనుంది. ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.
ఆదిలాబాద్ రీజియన్ నుంచి 369 బస్సులు
ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల నుంచి మొత్తం 369 బస్సులను నడుపాలని నిర్ణయించారు. చెన్నూరు బస్టాండు నుంచి 70, బెల్లంపల్లి నుంచి 89, శ్రీరాంపూర్ నుంచి 45, మందమర్రి నుంచి 50, మంచిర్యాల నుంచి 115 బస్సులను మేడారం జాతరకు నడపనున్నారు.
ఖమ్మం రీజియన్ నుంచి 244 బస్సులు
ఖమ్మం రీజియన్ నుంచి మొత్తం 244 బస్సులను నడపనున్నారు. వీటిల్లో కొత్తగూడెం డిపో నుంచి 110 బస్సులు ఉండగా.. ఇల్లెందు నుంచి 41, భద్రాచలం నుంచి 21, పాల్వంచ నుంచి 15, సత్తుపల్లి ఏటూరునాగారం నుంచి 17, చర్ల నుంచి 3, వెంకటాపూర్ నుంచి 6, మణుగూరు నుంచి 16, మంగపేపట నుంచి 5, ఖమ్మం నుంచి 10 ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
భూపాలపల్లి డిపో నుంచి
ఇక భూపాలపల్లి డిపో నుంచి ప్రత్యేక బస్సులను మేడారం జాతరకు బయల్దేరనున్నాయి. ఘనపూర్, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, పస్రా,చల్పూర్ మీదుగా ఈ బస్సులు వెళ్లనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు ఈ బస్సులు తిరగనన్నాయి.
