విధాత, హైదరాబాద్ : అనేక భద్రత ప్రమాణాలతో రూపొందించబడి..కేవలం గ్యాస్ కట్టర్‌లతో మాత్రమే ధ్వంసమయ్యే ఏటీఎంల సాంకేతికతకు తమ చోర కళతో సాధారణ యువకులు సవాల్ విసిరారు. ప్లాస్టిక్ పట్టీని పెట్టి ఏటీఎంలో డబ్బులు చోరీ చేస్తున్న మైనర్ దొంగల నైపుణ్యం చూసి పోలీసులు సైతం ముక్కున వేలేసుకున్నారు. వరంగల్ జిల్లాలో బట్టల షాపులో పనిచేయడానికి ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన శుభం, అతని గర్ల్ ఫ్రెండ్ జల్సాల కోసం ఏటీఎంలో డబ్బులు వచ్చే దగ్గర ప్లాస్టిక్ పట్టిని పెట్టి ఫెవిక్విక్ తో అంటించి వెళ్లేవారు. డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వచ్చిన వారు డబ్బులు రాకపోవడంతో తిరిగి వెళ్ళిపోయేవారు. ఇలా వాళ్లు వెళ్లాక ఆ డబ్బులు తీసుకొని శుభం జల్సాలు చేసేవాడు. దీని గురించి అడిగి తెలుసుకున్న మరికొంత మంది మైనర్లు ఇలా ఏటీఎం చోరీలు చేయడం పనిగా పెట్టుకున్నారు. ఈ తరహా సంఘటనలపై బ్యాంకు అధికారులకు ఎక్కువ ఫిర్యాదులు రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సీసీ కెమెరాల ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. అసలు దొంగ శుభం, అతని గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఇంకా పరారీలో ఉన్నారు.
ATM Theft | ఏటీఎం సాంకేతికతకు దొంగల సవాల్ … ప్లాస్టిక్ పట్టిని పెట్టి ఏటీఎంలో డబ్బుల చోరీ
