రుణమాఫీకి భూముల అమ్మకాలకు సిద్ధమైన రాష్ట్ర సర్కార్‌ … బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రైతు రుణ మాఫీ అమలు చేసేందుకు రాష్ట్రంలోని భూములను అమ్మేందుకు సిద్ధమైందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు

  • Publish Date - July 1, 2024 / 06:59 PM IST

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రైతు రుణ మాఫీ అమలు చేసేందుకు రాష్ట్రంలోని భూములను అమ్మేందుకు సిద్ధమైందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన భూముల అమ్మకానికి ప్రభుత్వం రెడీ అయ్యిందని ఆరోపించారు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పాలకులు తమ జేబులు నింపుకునే రీతిలో కొత్త చట్టాలు తీసుకురాబోతుందని ఆరోపించారు. భవిష్యత్ తెలంగాణలో పార్కులకు కూడా స్థలం ఉండదన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి, లా అండ్ అర్డర్ అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. బీజేపీలోకి రావాలనుకునే ఎమ్మెల్యేలు వాళ్ల సొంత పార్టీకి, పదవులకు రాజీనామా చేసి వస్తేనే బీజేపీలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా ఇతరులపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు స్పీడ్ పోస్ట్ పంపుతామని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు తాకట్టు పెట్టారని విమర్శించారు. గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తోన్న యువకుడిని పరామర్శించేందుకు వెళ్తే అక్కడ ఆంక్షలు విధించడం ప్రజా పాలనా ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని, త్వరలోనే ఇరిగేషన్ శాఖలోని అవకతవకలను బయట పెడతానని స్పష్టం చేశారు.

Latest News