– బీఆరెస్ కార్యకర్తలకు అండగా ఉంటాం
– ప్రజల పొరపాటో, గ్రహపాటో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
– అభివృద్ధిని పక్కనపెట్టి మా కార్యకర్తల వెంట పడుతోంది
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
విధాత బ్యూరో, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయిస్తోంది.. వీటికి బెదరం అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లా జైలులో ఉన్న జగిత్యాల మండలం హబ్సిపూర్ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని బుధవారం పరామర్శించడానికి వెళ్తున్న ఆమె మెట్ పల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అభివృద్ధిని పక్కనపెట్టి బీఆర్ఎస్ కార్యకర్తల వెంట పడుతోందని విమర్శించారు. ‘మనం అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు, ప్రజల కోసమే పాటు పడ్డాం’ అని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వాన్ని నిలదీసి, నిగ్గదీసి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువ చేసేలా పార్టీ కార్యకర్తలు పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజలు సంతోషంగా ఉండటమే తమకు ముఖ్యమని, వారికోసం తాము చేసే పోరాటాలలో ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ముందుకే సాగుతామన్నారు. అందులో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. అక్రమాలను ఎదిరించాలని, అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొనాలని కోరారు. దశాబ్ద కాలం తాము అధికారంలో ఉన్న నాడు, సాఫీగా పాలన సాగించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఒక ఆడబిడ్డ ఆందోళనకు పూనుకుంటే జుట్టు పట్టి లాగిన ఘటనలు ప్రత్యక్షంగా చూస్తున్నామని, కాంగ్రెస్ వైఖరి, వాళ్ల నేతల వైఖరి ఏమిటో ప్రజలు గమనించాలన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం రాజకీయాల్లో తగదన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యక్తిగత కక్షతో టీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తూ, కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. జీవన్ రెడ్డి పెద్దలు.. ఇలాంటి పనులు చేయడం ఆయనకు తగదన్నారు. ఎప్పటికైనా మళ్లీ తమకు మంచి రోజులు వస్తాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొన్నట్లు, ఇప్పుడు కూడా ఎదుర్కొంటామని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని.. పార్టీ ఎప్పుడు వారికి అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజల పొరపాటో, గ్రహ పాటో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది… మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రజల హృదయాన్ని మళ్లీ గెలుచుకుంటామని తెలిపారు.