Site icon vidhaatha

రేపే గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్షలు … ఏర్పాట్లు సిద్ధం

విధాత, హైదరాబాద్ : ఆదివారం నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముందుగా ప్రకటించిన తేదీల మేరకు గ్రూప్-1ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 897 పరీక్ష కేంద్రాల్లో 4.03 లక్షలమంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే ఉదయం 10 గంటలకే కేంద్రాల గేట్లు మూసివేస్తారు. 10గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు పేర్కొన్నారు.

పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచారు. హాల్ టికెట్లు, ప్రశ్న పత్రంపై ముద్రించిన సూచనలు పాటించాలని తెలిపింది. అభ్యర్థులంతా హాల్ టికెట్‌పై గత మూడు నెలల్లో తీసుకున్న పాస్‌పోర్టు ఫోటో అంటించాలని, హాల్ టికెట్‌తో పాటు ఒరిజనల్ ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకరావాలని టీజీపీఎస్సీ తెలిపింది. అభ్యర్ధులందరికి బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయరని ప్రకటించింది. గతంలో తలెత్తిన పేపర్ల లీకేజీ సమస్యలు పునరావృతం కాకుండా టీజీపీఎస్సీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది.

Exit mobile version