Tomato Prices | హైదరాబాద్ : ఉల్లి( Onion )తో పాటు టమాటా( Tomato ) ధరలు కొండెక్కాయి. వంటింట్లో నిత్యం ఉపయోగించే ఈ రెండింటి ధరలు దసరా పండుగ( Dasara Festival ) వేళ భారీగా పెరిగిపోవడంతో.. గృహిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలన్నర క్రితం వరకు కిలో రూ. 20 నుంచి రూ. 30 పలికిన ధర ఇప్పుడు అమాంతం రూ. 100కు చేరింది. కొన్ని మార్కెట్లలో రూ. 100కు పైనే విక్రయిస్తున్నాయి.
ప్రస్తుతం రైతు బజార్లు( Rythu Bazar ), హోల్‌సేల్‌లో కిలో టమాట ధర ర. 60 నుంచి రూ. 80 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో రూ. 100కు చేరువైంది. డిమాండ్‌కు సరిపడా టమాట మార్కెట్‌కు రాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు( Rains ), పోటెత్తిన వరదల( Floods ) వల్ల టమాట పంటకు భారీగా నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. దీంతో ధరలు అమాంతం పెరిగాయని తెలిపారు.
సాధారణంగా వర్షాకాలం( Monsoon )లో టమాట ధరలు తగ్గి.. ఎండాకాలం( Summer )లో పెరుగుతాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. వర్ష ప్రభావంతో ప్రస్తుతం ధరలు పెరిగాయని, కొత్త పంట చేతికొచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
ఇక ఉల్లిపాయ ధర కూడా భారీగా పెరిగింది. రైతు బజార్లలో కిలో రూ. 50 చొప్పున విక్రయిస్తుండగా, రిటైల్, ఇతర మార్కెట్లలో రూ. 60 నుంచి రూ. 80కి తగ్గడం లేదు. ఉల్లిపాయ కొనాలంటేనే గృహిణులు భయపడిపోతున్నారు. ఈ ధరలు ఇలానే కొనసాగితే పండుగ చేసుకోవడం కూడా కష్టమేనని అంటున్నారు.