Tomato | తెలంగాణ వ్యాప్తంగా ఆకాశాన్నంటిన ట‌మాటా ధ‌ర‌లు.. కిలో రూ. 100 పైనే

Tomato | ట‌మాటా ధ‌ర‌లు మ‌రోసారి ఆకాశాన్నాంటాయి. గ‌తేడాది జూన్ - జులై మాసాల్లో టమాటా ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. నాడు ట‌మాటా రైతులు కోటీశ్వ‌రులు అయిపోయారు. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి పున‌రావృతం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. తెలంగాణ వ్యాప్తంగా కిలో ట‌మాటా రూ. 100 పైనే ప‌లుకుతోంది.

  • Publish Date - June 19, 2024 / 07:12 AM IST

Tomato | హైద‌రాబాద్ : ట‌మాటా ధ‌ర‌లు మ‌రోసారి ఆకాశాన్నాంటాయి. గ‌తేడాది జూన్ – జులై మాసాల్లో టమాటా ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. నాడు ట‌మాటా రైతులు కోటీశ్వ‌రులు అయిపోయారు. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి పున‌రావృతం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. తెలంగాణ వ్యాప్తంగా కిలో ట‌మాటా రూ. 100 పైనే ప‌లుకుతోంది. ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్, మెద‌క్, ఖ‌మ్మం జిల్లాల్లో ట‌మాటా ధ‌ర‌లు భారీగా పెరిగాయి.

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో జూన్ తొలి వారంలో కిలో ట‌మాటా ధ‌ర రూ. 30 ఉండ‌గా, ప్ర‌స్తుతం రూ. 80 నుంచి రూ. 100 ప‌లుకుతోంది. సోమ‌వారం జ‌హీరాబాద్ మార్కెట్‌లో కిలో ట‌మాటా ధ‌ర రూ. 100గా విక్ర‌యించారు. ఖ‌మ్మం జిల్లాలో రూ. 80 నుంచి రూ. 100 ప‌లుకుతోంది. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కూడా ట‌మాటా ధ‌ర రూ. 100 ఉంది. ఒక్క ట‌మాటానే కాదు.. ఉల్లిపాయ ధ‌ర‌లు కూడా ఘాటెక్కాయి.

ఇక సంగారెడ్డి, సిద్దిపేట‌, మెద‌క్ జిల్లాల‌కు చెందిన రైతులు ట‌మాటాను విరివిగా పండిస్తారు. పండించిన ట‌మాటాను హైద‌రాబాద్‌లోని బోయిన్‌ప‌ల్లి మార్కెట్‌కు, సిద్దిపేట‌లోని వంటిమామిడి మార్కెట్‌కు త‌ర‌లిస్తుంటారు. గ‌త ఐదారు నెల‌ల్లో భారీగా ట‌మాటాను త‌ర‌లించేవారు. కానీ ఇప్పుడు స‌రిప‌డా ట‌మాటా మార్కెట్‌కు రావ‌డం లేదు. దీంతో హైద‌రాబాద్ న‌గ‌రంలో కిలో టమాటా ధ‌ర రూ. 100 విక్ర‌యిస్తున్నారు. ఇక ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల ధ‌ర కూడా ఘాటెక్కింది. గ‌త కొన్ని వారాల నుంచి మిర్చి ధ‌ర రూ. 80 నుంచి రూ. 120పైనే ప‌లుకుతోంది. కొత్తిమీర‌, పుదీనా ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి.

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో సోమ‌వారం కిలో ట‌మాటా ధ‌ర రూ. 80కి విక్ర‌యించ‌గా, మంగ‌ళ‌వారం నాడు మాత్రం రూ. 100కు విక్ర‌యిస్తున్నారు. బీన్స్ కిలో ధ‌ర రూ. 160, చిక్కుడు రూ. 120, కాక‌ర కాయ రూ. 120, బీర‌కాయ రూ. 100, వంకాయ రూ. 80, బెండ‌కాయ రూ. 60కి విక్ర‌యిస్తున్నారు.

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ట‌మాటా, బెండ‌కాయ‌, ప‌చ్చి మిర్చి, ఆలుగ‌డ్డ‌తో పాటు ఇత‌ర కూర‌గాయ‌ల ధ‌ర‌లు కిలోపై రూ. 30 దాకా పెరిగాయి. ట‌మాటా కిలో ధ‌ర రూ. 80, ప‌చ్చి మిర్చి రూ. 70కి విక్ర‌యిస్తున్నారు. కొత్తిమీర ధ‌ర రూ. 20 ప‌లుకుతోంది. ఆకుకూర‌ల ధ‌ర‌లు కూడా విప‌రీతంగా పెరిగిపోయాయి. మొత్తంగా కూర‌గాయ‌ల ధ‌ర‌లు అమాంతం పెరిగిపోవ‌డంతో సామాన్యులు కొన‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Latest News