TPCC Chief | మంత్రుల మధ్య వివాదం..మా కుటుంబ సమస్య: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

మంత్రులు కొండా సురేఖ, సీతక్క వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల మధ్య వివాదం మా కుటుంబ సమస్య అని..దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, నేను కూర్చుని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

విధాత, హైదరాబాద్ : మంత్రులు కొండా సురేఖ(Konda Surekha), సీతక్క(Seethakka) వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy)ల మధ్య వివాదం(Ministers Dispute) మా కుటుంబ సమస్య అని..దీనిపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), నేను కూర్చుని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని టీపీసీసీ చీఫ్(TPCC Chief)  బి. మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రుల వివాదంపై అడిగిన ప్రశ్నపై స్పందించారు. మంత్రుల మధ్య తలెత్తింది పెద్ద సమస్య కాదు అన్నారు. కేవలం సమాచార లోపం వల్ల ఏర్పడిన సమస్య మాత్రమేనన్నారు. కొండా సురేఖ-పొంగులేటిల వివాదంపై కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు చేసింది వాస్తవమేనన్నారు. పార్టీలో ఎవరైన పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంలో సవాల్ చేస్తామని..ఇందుకోసం సోమవారం నేను, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి ఢిల్లీకి వెలుతున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులో పోరాటం చేయబోతున్నామన్నారు. సుప్రీంకోర్టులో ట్రిపుల్ టెస్టు అనుగుణంగా మేం మా వాదన వినిపిస్తామన్నారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసమే స్థానిక ఎన్నికలు ఆలస్యం

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయన్నారు. హైకోర్టు స్థానిక ఎన్నికలను 50శాతం రిజర్వేషన్లతో నిర్వహించుకోమని చెప్పినప్పటికి మేం ఎన్నికలకు వెళ్లకుండా 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెలుతున్నామన్నారు. బిల్లులు గవర్నర్, కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయని..బీజేపీ ఎందుకు ప్రధాని మోదీని దీనిపై అడగడం లేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీసీ ప్రజలకు నోటికాడి ముద్దను కాలదన్నడంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. బీసీ సంఘాలు ఈ నెల 14న తలపెట్టిన మద్దతుకు మేం సంఘీభావం చెబుతామన్నారు. బీసీల బంద్ కు బీజేపీ మద్దతు హాస్యాస్పదమన్నారు. తమ చేతిలో ఉన్న బీసీ బిల్లులను అమోదించకుండా వారు ఇప్పటికే ప్రజాకోర్టులో దోషిగా ఉన్నారని..ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో 80శాతం అమలు చేశామని..ఆరు గ్యారంటీల అమలులో, అభివృద్ధి సంక్షేమంలో ఎక్కడైనా మేం చర్చకు సిద్దమన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తామని ఇవ్వలేదన్నారు. ఏడున్నర లక్షల కోట్ల అప్పులు మా నెత్తిన వేసిపోయినా..ప్రజాసంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 14నుంచి ఆ నియోజకవర్గంలో బస్తీబాట చేపట్టునున్నామని తెలిపారు.