చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వంపై హై కోర్టు తీర్పు రిజర్వ్

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై హైకోర్టులో విచారణ జ‌రిగింది

  • Publish Date - January 12, 2024 / 03:17 PM IST

* ఇరువురి వాద‌న‌లు పూర్తి

* తీర్పును రిజ‌ర్వు చేసిన న్యాయ‌స్థానం

విధాత‌, హైద‌రాబాద్: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై హైకోర్టులో విచారణ జ‌రిగింది. మాజీ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్ 2018 ఎన్నిక‌ల్లో త‌ప్పుడు అఫిడ‌విట్‌ దాఖ‌లు చేశార‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఆది శ్రీ‌నివాస్ తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చెన్న‌మ‌నేని ర‌మేశ్ జ‌ర్మ‌నీ పాస్‌పోర్ట్‌ పై ప్ర‌యాణాలు చేశార‌ని, అదేవిధంగా జ‌ర్మ‌నీ పౌర‌స‌త్వం మీద‌నే ఎన్నిక‌ల్లో పోటీ చేశార‌ని, ఇది చ‌ట్ట‌విరుద్ధం అని కాంగ్రెస్ నేత పిటిష‌న్‌లో పేర్కొన్న విష‌యం తెలిసిందే. దీనిపైన విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం ర‌మేశ్ విదేశీ ప్ర‌యాణాల వివ‌రాలు అంద‌జేయాల‌ని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ పిటిష‌న్‌పై శుక్ర‌వారం విజ‌య్‌సేన్‌రెడ్డి ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. చెన్నమనేని రమేశ్ విదేశీ ప్రయాణాల‌కు సంబంధించిన పూర్తి వివరాల‌ను అడిషనల్ సొల్సిటర్ జనరల్ కోర్టుకు సమర్పించారు.


జర్మనీ పౌరసత్వంతో జర్మనీ పాస్‌పోర్ట్ మీదనే విదేశాలకు వెళ్లినట్టు కేంద్రం నివేదిక ఇచ్చింది. ర‌మేశ్ రెండు సార్లు విదేశీ ప్ర‌యాణాలు చేశార‌ని కేంద్రం నివేదిక‌లో పేర్కొంది. కేంద్రం ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోవాలని సీనియర్ కౌన్సిల్ రవి కిరణ్ రావ్ న్యాయ‌స్థానం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే జెర్మనీ పాస్ పోర్ట్ పై ప్రయాణించినంత మాత్రాన జర్మనీ పౌరుడు కాదని జెర్మనీ ఎంబసీ తెలిపిన విషయాన్ని మరోసారి కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు. చెన్న‌మ‌నేని రమేశ్ త‌రుఫు సీనియర్ న్యాయవాది వై.రామారావు.. ఇది కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని తెలిపారు. భవిష్యత్తులో ప్రయాణాలకు జర్మనీ వీసా తీసుకున్నట్లు తెలిపారు. జెర్మనీ పౌరసత్వం లేదని చెప్పడానికి జెర్మనీ వీసా పొందడం నిదర్శమని వివ‌రించారు. సెక్షన్ 10(3) ప్రకారం ఈ కేసుని పరిశీలించాలని, సెక్షన్ 9 కింద పాస్ పోర్ట్ విషయం పరిశీలించాలని అది సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చెయ్యాలని సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను చెన్న‌మ‌నేని త‌రుఫు సీనియ‌ర్ న్యాయవాది న్యాయ‌స్థానానికి అంద‌జేశారు. ఇరువురి వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం తీర్పును రిజ‌ర్వు చేసింది.