విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: మార్చి నెలలో దుద్దేడకు రైలు వస్తదని, ఏప్రిల్, మే నెలలోపు సిద్దిపేటకు రైలు వచ్చేలా వేగంగా పనులు జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి నిర్మాణంలో ఉన్న దుద్దెడ రైల్వే స్టేషన్ వరకూ దాదాపు 11 కిలో మీటర్ల మేర జరుగుతున్న రైల్వే ట్రాక్ లైను పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
సిద్దిపేటకు రైల్వే ఏర్పాటు దశాబ్దాల కలని ఆ రైల్వే కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సాకారం చేశారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇప్పటికే ఫేస్ 1 ద్వారా హైదరాబాద్ నుండి మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ వరకు 44 కిలోమీటర్లు రైలు సేవలు ప్రారంభమై రాకపోకలు సాగిస్తుంది.
ఫేజ్-2 ద్వారా గజ్వేల్ నుండి సిద్దిపేట వరకు పనులు వేగంగా జరుగుతున్నాయని, గజ్వేల్ నుండి దుద్దెడ వరకు 21 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తి కావస్తుంది. దుద్దెడ నుండి సిద్దిపేటకు 11 కిలోమీటర్లు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
రైల్వే పనుల నిర్మాణంలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో ఉందని మంత్రి తెలిపారు. రైల్వే లైన్ ఏర్పాటుతో నష్టపోతున్న ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో ఇంటి స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇచ్చామని, రైల్వే శాఖ వారు పనుల్లో వేగం పెంచి డే నైట్ వర్క్స్ నిర్వహించి త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమరాజు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్ధన్ బాబు, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈ సుదర్శన్ రెడ్డి, ఎస్ఈ ఎలక్ట్రిసిటీ ప్రభాకర్, ఇరిగేషన్ మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు ఉన్నారు.
రైతు కల్లాలపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం కయ్యం: మంత్రి హరీశ్ రావు
జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశంలో పాల్గొని మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన రైతు కల్లాలపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం కయ్యం పెడుతున్నదని ధ్వజమెత్తారు.
రైతులు ఆయిల్ ఫామ్ సాగు పెంచేలా కృషి చేయాలని, అవసరమైతే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోయి క్షేత్ర సందర్శన-ఫీల్డ్ విజిట్ వెళ్లాలని మంత్రి దిశానిర్దేశం చేసారు. ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోరిక మేరకు దుబ్బాక నియోజకవర్గంకు అవసరమైన స్పింక్లర్ సెట్లు అందించాలని డీడీ రామలక్ష్మికి మంత్రి ఆదేశించారు.
విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి వెల్లండించారు. జనవరి 2వ తేదీన మనఊరు-మనబడిలో భాగంగా పనులు పూర్తి అయిన 100 పాఠశాలలను ప్రారంభం చేద్దామని విద్యాశాఖ అధికారులకు తెలిపారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, అన్నీ మండలాల ప్రజా ప్రతినిధులు, అన్నీ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.
హుస్నాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ పై మంత్రి హరీష్ ఆగ్రహం
హుస్నాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్, సిబ్బంది పై ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ లో డయాలసిస్ కేంద్రం ప్రారంభం చేసిన తెల్లారే తాళం వేయడం జరిగింది ఏంటిని ప్రశ్నించారు.
48 గంటల్లో సమస్య పరిష్కారం చేసి ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం తిరిగి ప్రారంభం చేయాలని వైద్యాధికారులకు ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు.