Site icon vidhaatha

మహాలక్ష్మితో బస్సులలో రెట్టింపైన రద్ధీ.. జూన్‌ 15 నాటికి అదనంగా 150

దశలవారీగా మరో 450 ఎలక్ర్టిక్‌ బస్సులు
కొత్త బస్సులతో తప్పనున్న ప్రయాణ తిప్పలు

విధాత, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలతో ప్రయాణికుల రద్దీ రెట్టింపు కావడంతో నగర ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త బస్సులపై ఆర్టీసీ దృష్టిపెట్టింది. సిటీ బస్సుల్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 20 లక్షలకు పెరిగింది. గ్రేటర్‌ జోన్‌లో ఆర్టీసీ ప్రస్తుతం 2,900 బస్సులు నడుపుతూ రోజూ 20 లక్షల మందికి సేవలందిస్తోంది. 2024 డిసెంబర్‌ నాటికి గ్రేటర్‌ జోన్‌లో బస్సుల సంఖ్య 3,500కు పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ సహకారంతో ఒక వైపు ఎలక్ర్టిక్‌ బస్సులు, మరో వైపు డీజిల్‌ బస్సులను పెంచుకునే దిశగా ఆర్టీసీ సంస్థ ప్రయత్నాలు చేస్తుంది.

జూన్‌ 15 నాటికి నగరంలో 150 కొత్త బస్సులు రోడ్లపైకి తీసుకొచ్చే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటిలో 125 మెట్రో డీలక్స్‌ బస్సులు, 25 ఎలక్ర్టిక్‌ బస్సులు ఉండనున్నట్లు, వీటిని విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. మరో ఆరు నెలల్లో గ్రేటర్‌లో దశలవారీగా 450 ఎలక్ర్టిక్‌ బస్సులు తెస్తామని ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే ఎలక్ర్టిక్‌ బస్సుల రాక ఆలస్యం అవుతుండడంతో ఈలోపు డీజిల్‌ బస్సులను సమకూర్చుకోవడంపై టీఎస్‌ ఆర్టీసీ దృష్టిసారించింది.

30 లక్షలకు చేరే చాన్స్‌

జూన్‌లో వచ్చే 125 మెట్రో డీలక్స్‌ బస్సుల్లో 2/2 సీటింగ్‌ సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. బస్సుల సంఖ్య పెరిగితే రోజువారీ ప్రయాణికుల సంఖ్య 30 లక్షలకు చేరే అవకాశముంటుందని ఆర్టీసీ భావిస్తోంది. ప్రధానంగా శివారు ప్రాంతాలు విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ ఆర్టీసీ బస్సుల రూట్‌ మ్యాప్‌లను అందుబాటులోకి తేవాల్సి ఉందన్నారు. ఫలితంగా రోడ్లపై సొంత వాహనాల రద్దీని కొంతమేర తగ్గించే అవకాశాలుంటాయని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో గ్రేటర్‌ల ప్రైవేట్‌ వాహనాల సంఖ్య పెరుగుతున్నదన్నారు.

వీటి పెరుగుదలతో ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడుతున్నాయని, ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని వారు అంటున్నారు. నగరంలో ఆర్టీసీ బస్సులు సమయానుకూలంగా నడపకపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కార్యాలయాల సమయంలో బస్సుల సంఖ్య తక్కువ ఉండడం, రద్దీ ఎక్కువగా ఉండడంతో చాలామంది బస్సులు ఎక్కడం లేదు. ప్రధానంగా రాత్రి సమయాల్లో బస్సుల్లేక ప్రయాణికులు ఆటోలను, క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో సంస్థ ఆదాయానికి గండిపడుతోంది. సమయానుకూలంగా పీక్ ఆవర్స్‌లలో బస్సులు నడపడంతో పాటు కొత్త మార్గాల్లో కూడా బస్సులను నడిపితే ఆదాయం పెంచుకునే అవకాశముంది.

Exit mobile version