విధాత: సంక్రాంతి పండుగ సెలవులు ముగిసిపోవడంతో పాఠశాల విధులకు హాజరయ్యేందుకు బయలుదేరిన ఉపాధ్యాయుల కారు బోల్తా కొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా కేంద్రం నుంచి తుంగతుర్తి మండలంలోని పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయుల కారు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం రోడ్డు వద్ద బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో కారులో తుంగతుర్తి మండల జిహెచ్ఎం అల్వల ప్రవీణ్ కుమార్, ఆయన సోదరి అన్నారం జిహెచ్ఎం అల్వల సునీతరాణి, రావులపల్లి జిహెచ్ఎం గీతారెడ్డి, కస్తూర్బా గాంధీ ఏఎస్ఓ కల్పన, జిహెచ్ ఎం సునీతలు ఉన్నారు.
ప్రమాద స్థలంలోనే కల్పన ప్రాణాలు కోల్పోగా, హైదరాబాద్ కి తరలిస్తుండగా మరో ఉపాధ్యాయురాలు “గీతారెడ్డి” మృతి చెందారు.క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
