మీరు తప్పులు చేసి..మాపై దుష్ప్రచారమా

పదేళ్ల బీఆరెస్ పాలనలో అప్పులు..తప్పులు చేసి ఇప్పుడు హామీలు అమలు చేయడం లేదని..ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తున్నారని మాపై దుష్ప్రచారం చేస్తున్నారని

  • Publish Date - January 20, 2024 / 02:53 PM IST
  • కృష్ణా ప్రాజెక్టులపై బీఆరెస్ అబద్ధాల మాటలు
  • ప్రాజెక్టుల పేరుతో లూటీ
  • పౌర సరఫరాల శాఖలోనూ అవినీతే
  • బీఆరెస్‌పై డిప్యూటీ సీఎం భట్టి..మంత్రి ఉత్తమ్ ఫైర్‌

విధాత : పదేళ్ల బీఆరెస్ పాలనలో అప్పులు..తప్పులు చేసి ఇప్పుడు హామీలు అమలు చేయడం లేదని..ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తున్నారని మాపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆరెస్ నేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఎన్ .ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రానున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు సంబంధించి ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖల ప్రతిపాదనలపై వారు చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించాలన్న ప్రతిపాదనలేవీ తాము చేయలేదని స్పష్టం చేశారు.

ఏపీ సీఎం జగన్‌తో ఇంతకాలంగా అంటకాగి, కృష్ణా జలాల్లో వాటాను వదులుకున్న చరిత్ర కేసీఆరేదేనని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ఖజానాను బీఆరెస్‌ లూటీ చేసిందని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని బీఆరెస్‌ చేతిలో పెడితే అప్పులపాలు చేశారని, అందుకే ప్రజలు ఆ పార్టీకి వీఆర్ఎస్ ఇచ్చారన్నారు. ప్రజాధనాన్ని దుర్వనియోగం చేస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు. గతంలో ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్, జగన్ మాట్లాడుకున్న విషయాలు ప్రజలకు ఎందుకు చెప్పలేదని ఉత్తమ్ ప్రశ్నించారు. బీఆరెస్ పాలనలో చివరకు పౌర సరఫరాల శాఖలోనూ అవినీతికి పాల్పడి నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అప్పులు, వడ్డీలతో ప్రజలపై భారం మోపారని ఆక్షేపించారు. రైతుల మంచి ప్రతి దాన్యం గింజ కొనేలా పౌరసరఫరాల శాఖకు నిధులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజాభిప్రాయాలకు అణుగుణంగానే అభివృద్ధి సాగుతుందని స్పష్టం చేశారు.