మోడీ మోసపూరిత మాటలు ప్రజలు నమ్మేస్థితిలో లేరు

మోడీ పదేళ్ళ పాలనలో నిరుద్యోగం, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కరీంనగర్ లోకసభ కాంగ్రెస్ అభ్య‌ర్థిత్వం కోసం ఆశిస్తున్న నేత వెలిచాల రాజేందర్ రావు విమర్శించారు.

  • Publish Date - April 19, 2024 / 05:50 PM IST

పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థిత్వం కోసం ఆశిస్తున్న నేత వెలిచాల

విధాత బ్యూరో, కరీంనగర్: మోడీ పదేళ్ళ పాలనలో నిరుద్యోగం, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కరీంనగర్ లోకసభ కాంగ్రెస్ అభ్య‌ర్థిత్వం కోసం ఆశిస్తున్న నేత వెలిచాల రాజేందర్ రావు విమర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో వెలిచాల రాజేందర్ రావు ప్రసంగించారు.

బిజెపి ప్రభుత్వం కుల,మత విద్వేషాలను సృష్టిస్తూ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని తన పదేళ్ల పాలనలో కనీసం 20 వేల నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. రైతులు,దళితులను చిన్నచూపు చూసిన ఘనత బిజెపి,బీఆరెస్ పార్టీలకే దక్కుతుందని ఆరోపించారు.

దేశంలోని ప్రజల సొమ్మును అదాని, అంబానీలకు కేంద్రం ధారాదత్తం చేసిందని ఆరోపించారు. దేశంలో రాహుల్ గాంధీ-నరేంద్ర మోడీల మధ్య జరుగుతున్న ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగిన నెలలోపు మహిళలకు ఇచ్చిన హామీ మేరకు రూ.2500/- జమ చేయడంతో పాటు, ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ఐదు న్యాయాల గురించి ప్రజలకు తెలియజేసి, బిజెపి-బీఆర్ఎస్ పార్టీలో గత పదేళ్ల ప్రజావ్యతిరేక పాలనను గురించి ఓటర్లకు వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు, కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, సత్యనారాయణ గౌడ్, ప్రణబ్ బాబుతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పిటిసిలు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News