విధాత : అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంతో హడావుడి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షాలు తెలంగాణలోని భద్రాద్రి రామాలయం అభివృద్ధిని కూడా పట్టించుకోవాలని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ట్విట్టర్ ద్వారా అభ్యర్థించారు. దేశ ప్రజలందరం అయోధ్య రాముడిని ఎంత అభిమానిస్తామో.. మా భద్రాద్రి రాములవారిని కూడా అంతే విశ్వసిస్తామని విజయశాంతి తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. మరి మా భద్రాద్రి శ్రీరామ దేవుని సందర్శన కూడా భక్తి, భావోద్వేగాల గౌరవం అన్న అంశం తప్పక దృష్టిలో ఉంచుకోవలసిన ఆవశ్యకత ఉన్నది కదా అని.. తెలంగాణకు ఇన్ని మార్లు వచ్చిన మోడీ గారు, అమిత్ షాలు భద్రాద్రి రాముడిని ఎందుకు దర్శించుకోలేదంటూ జై శ్రీరామ్‌తో ట్వీట్ చేశారు.
బీఆరెస్..బీజేపీలు విస్మరించిన భద్రాద్రి రామాలయం అభివృద్ధి
కాగా అయోధ్య రామాలయం ప్రారంభోత్సవాన్ని ప్రపంచ స్థాయి ఈవెంట్‌గా నిర్వహిస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వం దక్షిణ భారత దేశంలోని అయోధ్యగా పేరొందిన తెలంగాణలోని భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయడం లేదన్న విమర్శలు ఆది నుంచి వినిపిస్తున్నాయి. బీఆరెస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ సైతం భద్రాచలం దేవస్థానాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని 2016లో 100కోట్లు ప్రకటించి బడ్జెట్‌లో 50కోట్లు కేటాయించి, 400కోట్లయినా భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. 65ఎకరాల్లో ఆలయాన్ని విస్తరించాలని నిర్ణయించి యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనందసాయితో భద్రాచలం అభివృద్దికి మాస్టర్‌ప్లాన్ రూపొందింపచేశారు. అయితే నిధులివ్వకపోగా ఆ తర్వాతా రాములోరి పెళ్లికి ప్రభుత్వం తరుపునా అందించే సీఎం స్వయంగా అందించే ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకొచ్చే సాంప్రదాయానికి కూడా దూరంగా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రాల అభివృద్ధికి ఉద్ధేశించిన ప్రసాద్ స్కీమ్ కింద తొలి దఫాగా 41.38కోట్లు మంజూరీ చేసింది. సదరు పనులను 2022డిసెంబర్‌లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శంకుస్థాపన చేశారు. ఈ పనుల్లో భాగంగా చేపట్టిన భవనాల నిర్మాణాలు పిల్లర్ల దశలోనే ఉండగా, పర్ణశాల అభివృద్ధి, రామాలయం రూఫ్ పనులు నేటికి ప్రారంభించకపోవడం భద్రాచలం అభివృద్ధి పట్ల కేంద్రం వహిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనమంటున్నారు.