Toll Relief  | విజయవాడ హైవేపై ‘టోల్’ ప్రేమ… తెలంగాణ హైవేలపై మౌనం

సంక్రాంతి పండుగకు కోస్తాంధ్రకు వెళుతున్న ప్రయాణీకుల సౌకర్యార్థం విజయవాడ హైవేపై టోల్ మినహాయించాలని మంత్రి కోమటిరెడ్డి కేంద్రాన్ని కోరడం తెలంగాణలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. తెలంగాణ హైవేలపై అదే ప్రేమ ఎందుకు లేదని తెలంగాణ వాహనదారులు మండిపడుతున్నారు.

సంక్రాంతి రద్దీ నేపథ్యంలో టోల్ ప్లాజా వద్ద నిలిచిపోయిన వాహనాలు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ - File

Toll Relief on Vijayawada Highway Triggers Debate in Telangana

విధాత తెలంగాణ డెస్క్​ | హైదరాబాద్​:

Toll Relief  | సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఫీజు మినహాయింపును కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర వరకు ప్రయాణించే వాహనదారుల మెప్పు కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకే రాష్ట్రంలో కొన్ని రహదారులకే టోల్ ఉపశమనం కోరి, మిగతా కీలక హైవేలపై ఎందుకు అదే వెసులుబాటు అడగడంలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజీవ్ రహదారి, వరంగల్, రామగుండం, ఖమ్మం, నిర్మల్, కొత్తకోట మార్గాల్లో నిత్యం ప్రయాణించే తెలంగాణ వాహనదారుల్లో అసంతృప్తి పెరుగుతోంది.

సంక్రాంతి పండుగకు ముందు రోజులలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ దిశగా భారీగా వాహనాలు బయలుదేరుతాయి. ఈ నేపథ్యంలో విజయవాడ హైవేపై టోల్ ఫ్లాజాల వద్ద ఏర్పడే రద్దీని దృష్టిలో పెట్టుకుని, జనవరి 9 నుంచి 14 వరకు, అలాగే పండుగ అనంతరం జనవరి 16 నుంచి 18 వరకు టోల్ ఫీజులు వసూలు చేయవద్దంటూ రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. గత మూడునాలుగు సంవత్సరాలుగా ఈ మార్గంలో పండుగ సమయంలో గంటలకొద్దీ వాహనాలు టోల్ ఫ్లాజాల వద్ద నిలిచిపోతున్న నేపథ్యంలో ఈ మినహాయింపును కోరినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు అప్పాయింట్​మెంట్​ ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని ఆ లేఖలో వెంకట్ రెడ్డి కోరారు. పండుగ ముందు, తరువాత తానే స్వయంగా హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి ఆంధ్రా రాష్ట్రం సరిహద్దు కోదాడ వరకు ప్రయాణించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని మంత్రి వెంకట్ రెడ్డి వెల్లడించారు.

టోల్ ఉపశమనంవిజయవాడ మార్గానికే పరిమితమా?

సంక్రాంతి పండుగకు నాలుగు రోజుల ముందుగానే ఆంధ్రా ప్రజలు హైదరాబాద్ నుంచి బయలుదేరి స్వగ్రామాలకు చేరుకుంటారు. దీంతో విజయవాడ, బెంగళూరు హైవే పై విపరీతమైన రద్ధీ నెలకొంటుంది. రద్ధీ కారణంగా గంటల కొద్దీ వాహనాలు టోల్ ఫ్లాజాల వద్ద నిల్చుండడం, సకుటుంబంతో వెళ్లేవారు అష్టకష్టాలుపడడం, గుంతలతో ప్రయాణాలు సాఫీగా సాగడం లేదు. చౌటుప్పల్, చిట్యాల, సూర్యాపేట తదితర ప్రాంతాలలో స్థానిక ప్రజల రాకపోకలు, కబ్జాల మూలంగా వాహనాలు వేగంగా కదలడం అసాధ్యంగా మారింది.

ఈ నేపథ్యంలో విజయవాడ హైవేపై టోల్ మినహాయింపు ఇవ్వడాన్ని ప్రభుత్వం ఉపశమన చర్యగా పేర్కొంటున్నప్పటికీ, అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రధాన రహదారులపై కూడా పండుగ రద్దీ అధికంగా ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. హైదరాబాద్ నుంచి వరంగల్, రామగుండం, ఖమ్మం, నిర్మల్, కొత్తకోట మార్గాల్లో పండుగ సమయాల్లో 90 శాతం కంటే ఎక్కువగా తెలంగాణ వాసులే ప్రయాణిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ రహదారులపై కూడా టోల్ ఫ్లాజాల వద్ద రద్దీ, ఆలస్యాలు సాధారణంగానే ఉంటాయని అంటున్నారు.

తెలంగాణ వాహనదారులకు ఎందుకు మినహాయింపు లేదు?’

విజయవాడ హైవేపై మాత్రమే టోల్ మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడాన్ని కొందరు స్వాగతిస్తున్నప్పటికీ, అదే వెసులుబాటు ఇతర హైవేలపై ఎందుకు ఇవ్వలేదన్న అంశం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఒకే రాష్ట్రంలో కొన్ని మార్గాలకు మాత్రమే టోల్ మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై విమర్శలు తప్పవని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలే అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నదా, ఆంధ్ర ప్రజల కోసం పనిచేస్తున్నదా అనేది అర్థం కావడం లేదని ఒక నాయకుడు వ్యాఖ్యానించారు.

విజయవాడ హైవేపై టోల్ ఫీజుల మినహాయింపుతో పంతంగి, కొర్లపాహడ్, చిల్లకల్లు టోల్ ఫ్లాజాల ద్వారా పండుగ రోజుల్లో దాదాపు రూ.30 నుంచి రూ.40 కోట్ల వరకు ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇతర హైవేలపై టోల్ వసూళ్లు కొనసాగడం వల్ల అసమానత స్పష్టంగా కనిపిస్తోందని విమర్శకులు చెబుతున్నారు.

ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని, పండుగ రోజులలో అన్ని ప్రధాన రహదారులపై సమానంగా టోల్ మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ వాహనదారులు కోరుతున్నారు. లేదంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయంగా మరింత వివాదాస్పదంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Latest News