విధాత, మెదక్ బ్యూరో: పర్యాటకులను ఆకర్షించే విధంగా పోచారం ప్రాజెక్ట్ ను పర్యాటకప్రాంతంగా తీర్చిదిద్దనున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. తెలంగాణా పర్యాటక అభివృద్ధి సంస్థ నుండి వచ్చిన సీనియర్ కన్సల్టెంట్, నీటిపారుదుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి తో కలిసి పోచారం ప్రాజెక్ట్ ను పర్యాటక ప్రాంతాంగా అభివృద్ధిపర్చుటకు ఉన్న మెరుగైన అవకాశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా పోచారం అభయారణ్యం ప్రాంతంలో సుమారు 30 ఎకరాల స్థలంలో థీమ్ పార్కును ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఇందులో శిథిలావస్థలో ఉన్న రెండు గెస్ట్ హౌస్ ల నిర్మాణం, హోటల్స్ తో పాటు బోటింగ్, చిల్డ్రన్ గేమ్స్, శౌచాలయాలు, లైటింగ్, పార్కింగ్ వంటివి ఏర్పాటు చేయడానికి కన్సల్టెంట్ లతో కలిసి ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు.
ఇందుకు సంబంధించి లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో త్వరలో కన్వర్జెన్సీ సమావేశం ఏర్పాటు చేసి పర్యాకులను ఆకర్షించే విధంగా ప్రణాళికకు తుది రూపు తీసుకువస్తామని ప్రతిమ సింగ్ తెలిపారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిస్తే సెలవులలో జిల్లా ప్రజలతో పాటు, సమీపంలో ఉన్న హైదరాబాద్ వాస్తవ్యులు కూడా ఉల్లాసం, ఆటవిడుపు కొరకు నరసాపూర్ అటవీ ప్రాంతం తో పాటు ఏడుపాయల, చర్చి, ఖిల్లా, పోచారం ప్రాంతాలను తిలకిస్తారని, తద్వారా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి శ్రీనివాస్, తెలంగాణా పర్యాటక అభివృద్ధి సంస్థ నుండి సీనియర్ కన్సల్టెంట్ బాలచందర్, నీటిపారుదల శాఖ డీఈఈ రాజు తదితరులు పాల్గొన్నారు.