ఏం చెబితివి..ఎక్కడ పోతివి.. ఇదేందీ : సామేల్ అన్నా

ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఇసుక అక్రమ రవాణాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలుగా మారాయి.

  • Publish Date - June 8, 2024 / 02:59 PM IST

ఇసుక అక్రమ రవాణాపై ఎమ్మెల్యే సామేల్‌పై విమర్శల దాడి

విధాత : ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఇసుక అక్రమ రవాణాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆరెస్ ప్రభుత్వం తుంగతుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడికి పాల్పడుతుందని తద్వారా భూగర్భ జలాలు అడుగంటి రైతాంగం నష్టపోతుందని, నన్ను గెలిపిస్తే పిడికెడు ఇసుక కూడా తీసుకపోనివ్వనని మందుల సామేల్ ప్రచారం చేశారు. మీడియా ఇంటర్వ్యూలలోనూ కాఫీ తాగుతూ ఇది కాఫీ కాదు..అన్నం చేతుల్లో పెట్టుకుని చెబుతున్నానని నా నియోజవర్గం నుంచి పిడికెడు ఇసుక కూడా తీసుకపోనివ్వనని ప్రకటించారు.

సామేల్ ఎమ్మెల్యేగా ఎన్నికై ఆరు నెలలు గడుస్తున్నా నియోజకవర్గం నుంచి ఇసుక అక్రమ రవాణా ఆగకపోవడం ఇప్పుడు ఆయనను విమర్శల పాలు చేస్తుంది. గతంలో మీరు చెప్పిందేమిటని..ఇప్పుడు నియోజకవర్గంలో జరుగుతుందేమిటంటూ ఇసుక అక్రమ రవాణా సాగుతున్న ఫోటోలు వీడియోలు..గతంలో సామేల్ చెప్పిన మాటల వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ సామేల్‌ను కడిగిపారేస్తున్నారు. పిడికెడు ఇసుక తియ్యనియ్యనని చెప్పావని, ఇదేందీ మరీ లారీలకొద్దీ ఇసుక తీసుకెలుతున్నా సప్పుడు చేస్తలేవు ఎందుకు సామేల్ అన్నా అని ప్రశ్నిస్తున్నారు. అంటే అన్నం ముందు పెట్టుకొని కుడా అబద్దాలు ఆడుతారా అంటూ నిలదీస్తున్నారు. సొంత పార్టీ నేతలు సైతం ఇసుక అక్రమ రవాణాపై సామేల్‌ను ప్రశ్నిస్తు పోస్టులు పెట్టారు. సామేల్ మాటలు నమ్మి 52వేల మెజార్టీతో గెలిపించామని, సామేల్ గెలిచాక కూడా ఇసుక అక్రమ రవాణా ఎందుకు సాగుతుందంటూ నిలదీస్తున్నారు. మాట పట్టింపులో..ప్రత్యర్థులపై విమర్శల దాడిలో నిక్కచ్చిగా దూకుడుగా ఉండే మందుల సామేల్ సోషల్ మీడియాలో ఇసుక అక్రమ రవాణాపై తను గతంలో చెప్పిన మాటలనే తనపై విమర్శనాస్త్రాలుగా సంధిస్తున్న వారికి ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Latest News