Aarogyasri | సాధారణ రోగాలకు ఆరోగ్యశ్రీలో చోటెక్కడ?

ఆరోగ్యశ్రీ పేదలకు భరోసా ఇచ్చే ఉచిత వైద్యపథకం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలులోకి తీసుకు వచ్చిన ఈ పథకం అనేక మంది పేద ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించింది.

  • Publish Date - May 15, 2024 / 06:30 AM IST

150 రకాల వైద్య సేవలను తీసివేసిన గత సర్కార్‌
అత్యధికంగా గ్రామీణ పేదలకు ఉపయోగపడేవే
250 వైద్య సేవలు జోడించే యోచనలో సర్కారు
దవాఖానలకు రూ.1200 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు
చెల్లించాలని కోరుతున్న ఆసుపత్రుల యజమాన్యాలు

విధాత: ఆరోగ్యశ్రీ పేదలకు భరోసా ఇచ్చే ఉచిత వైద్యపథకం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలులోకి తీసుకు వచ్చిన ఈ పథకం అనేక మంది పేద ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించింది. అయితే కాలక్రమేణా దీనికింద అమలులో ఉన్న వైద్య సేవలను కొన్నింటిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం తొలగించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పేదల ప్రజలకు ఎక్కువగా అవసరమయ్యే అపెండిక్స్ పర్పరేషన్ (పేగు పగలడం), హైడ్రోసిల్, థైరాయిడ్, వెసల్ క్యాసిరస్ (బ్లాడర్‌లో రాళ్లు వచ్చినప్పుడు) ఇలాంటి 150 సాధారణ జబ్బులను ఆరోగ్యశ్రీ వైద్య సేవల నుంచి నాటి సర్కారు తొలగించింది. దీంతో ఈ వ్యాధుల బారిన పడిన వాళ్లు డబ్బులు కట్టి ఆయా ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పైగా వైద్యసేవలకు అందించే వాటికి కూడా డబ్బులు సరిగ్గా అందించక పోవడంతో ప్రయివేట్, కార్పొరేట్‌ హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందించడానికి ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో 329 ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రకారం ఆరోగ్యశ్రీ కింద 949 రకాల జబ్బులకు వైద్యసేవలు అందించాలి. కానీ గత ప్రభుత్వం బకాయిలు చెల్లించక పోవడంతో రోగులకు వైద్య సేవలు అందించడానికి ప్రయివేట్ ఆసుపత్రులు జంకుతున్నాయి. ఆరోగ్యశ్రీ అంటే బాబోయ్ అంటున్నాయి. గత ప్రభుత్వం ప్రైయివేట్ ఆసుపత్రులకు దాదాపు రూ.1200 కోట్ల బకాయిలున్నాయి. ఈ బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు అందించ లేమంటూ ప్రైయివేట్ ఆసుపత్రులు చేతులు ఎత్తేస్తున్నాయి.

2023 డిసెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం పరిమితి రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అమలు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ తొలగించిన జబ్బులతో పాటు అదనంగా మరో 100 జబ్బులకు వైద్య సేవలు అందించే విధంగా పథకంలో యాడ్ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఈ మేరకు 949 జబ్బులకు ఉచిత చికిత్సను అదనంగా 250 చేర్చడం కోసం అధికారులు కసరత్తు చేసి జాబితాను సిద్ధంచేసినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి ఆమోదం తెలిపిన తరువాత అమలులోకి రానున్నది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అయినా సకాలంలో స్పందించి రూ. 1200 కోట్ల బకాయిలను విడుదల చేయాలని ప్రైవేట్‌ హాస్పిటల్‌ యాజమన్యాలు కోరుతున్నాయి. ఈ బకాయిలు విడుదల అయితే ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యసేవలు అందించగలుగుతామని చెబుతున్నారు.

Latest News