హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విధాత): కేసీఆర్‌కు మరక అంటడానికి మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావు కారణం అంటూ కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేశారు. ఇంతటితో ఆగని ఆమె ఈ ఇద్దరు నేతల వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు ప్రకటించి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. దీంతో రాష్ట్రంలో ఎవరి ఆరోపణల వెనుక ఎవరున్నారన్న చర్చ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తరువాత కేసీఆర్ తన కూతురు కవితను దూరం పెడుతూ వచ్చాడనే అభిప్రాయాలు బహిరంగంగానే వినిపించాయి. కనీసం కూతురుకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వనంత దూరం వెళ్లిందని, ఇంట్లో కూతురు ఎదురు పడితే పక్కకు తప్పుకొనేవారని తెలుస్తున్నది. కవిత తన కుమారుడు అమెరికాకు వెళుతున్న సందర్భంగా తండ్రిని కలువడానికి వెళితే.. బిడ్డను కలువకుండా మనుమడికే ఆశీర్వాదం ఇచ్చిపంపాడన్న చర్చ కూడా అప్పట్లో రాజకీయ వర్గాలలో ఆసక్తిగా జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం అర్ధరాత్రి అసెంబ్లీ వేదికగా కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించిన మరుసటిరోజు ఉదయం అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కవిత.. మరోసారి బాంబు పేల్చారు. హరీశ్ రావు, సంతోష్‌రావుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కొంత కాలంగా పార్టీకి, తండ్రికి, అన్నకు దూరంగా ఉంటున్న కవిత.. తండ్రిపై విచారణ అనగానే ఒంటి కాలిపై లేచారు. వారిద్దరి వల్లే తన తండ్రికి అవినీతి మరక అంటుకుందని చెబుతూ తన తండ్రి అమాయకుడన్న భావన కల్పించేందుకు ప్రయత్నించారు.
తండ్రి దూరం పెట్టడంతో కవిత కొంత కాలంగా జాగృతి పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా దివంగత నాయిని నర్సింహారెడ్డి గౌరవ అధ్యక్షుడిగా కొనసాగిన హెచ్ఎంఎస్‌కు తాజాగా గౌరవ అధ్యక్షురాలు అయ్యారు. దీంతో బీఆరెస్‌కు చెందిన కార్మిక సంఘానికి పోటీగా సంఘం నడుపుతారా? అన్న చర్చ కూడా జరుగుతున్నది. ఇది ఇలా ఉండగా గత కొంత కాలంలో వివిధ జిల్లాల్లో తమతో కలిసి పని చేయాలని కవిత అనుచరులు కొంత మంది బీఆరెస్ నేతలకు ఫోన్లు చేసి మాట్లాడినట్లుగా కింది నాయకులు చెపుతున్నారు. మాటల సందర్భంగా మీరు మాతో కలిసి పని చేస్తే ఆర్థిక సహాయం అందిస్తామని చెపుతూ ప్రభుత్వంలో ఏవైనా పనులు కావాలంటే చేసి పెడతామని కవిత అనుచరుడొకరు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరి వెనుక ఎవరున్నారు..? ఎవరు ఎవరిని ఆడిస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది.