– సర్పంచ్ ఎన్నికలకు సన్నద్ధం
– స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
– కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి కి నిధుల వరద
– అధికారం కోల్పోయి పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్న కెసిఆర్ బ్యాచ్
– కొడుకు, అల్లుడి పైనే నమ్మకం కోల్పోయిన కెసిఆర్
– 2014 లో సీఎం గా జైపాల్ రెడ్డి ని ప్రకటించి ఉంటే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చేది
– కెసిఆర్ హయాంలో లో తెలంగాణ ఆస్థిరత్వం కోల్పోయింది
– అభివృద్ధి లో కల్వకుర్తి ని అగ్రగామి గా నిలబెడుతా
– జూలై 31 లోగా రూ. లక్షన్నర.. ఆగస్టు లోగా రూ. రెండు లక్షల రుణ మాఫీ
– కల్వకుర్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉంటామని..ప్రతి గ్రామం.. తండా ల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని… ఇందు కోసం ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి అన్నారు.ఇప్పటి నుంచే సర్పంచ్ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సన్నద్ధం కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఆదివారం కల్వకుర్తి పట్టణం లో న మాజీ పార్లమెంట్ సభ్యుడు దివంగత సూదిని జైపాల్ రెడ్డి ఐదవ వర్ధంతి ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ..జైపాల్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకున్నా… చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో కొనసాగారని.. నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన రాజకీయాలు చేశారన్నారు.పదవులకే గౌరవం తెచ్చేలా జైపాల్ రెడ్డి వ్యవహరించారని.. రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని సీఎం కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన వెంటనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు ప్రకటించి ఉంటే 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
జైపాల్ రెడ్డి గారి సూచన మేరకే ఆనాడు పార్లమెంట్ తలుపులు మూసి, ప్రత్యేక ప్రసారాలు నిలిపి చ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం లో జైపాల్ రెడ్డి పాత్ర ఎంతో ఉందని సీఎం పేర్కొన్నారు. కల్వకుర్తి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారిందని ఆనాడు జైపాల్ రెడ్డి బాధపడ్డారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కెసిఆర్ హయాంలో ఆశించిన ఫలితాలు రాలేదన్నారు.ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు… నేను నల్లమల బిడ్డనే.. మీ సోదరుడినే అని, మీరు నాటిన మొక్క మహా వృక్షం గా మారిందని, ఇదంతా నల్లమల బిడ్డల ఆశీర్వాదం అని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే అమలు చేసి తీరుతుందన్నారు. కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని,ఆర్ అండ్ బీ రోడ్లు, గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తా మని ప్రకటించారు.మాడ్గుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుపరిచేందుకు రూ.10కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
నియోజకవర్గంలో అన్ని అన్ని గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు రహదారులు,కల్వకుర్తి- హైదరాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్లు అభివృద్ధి చేస్తామన్నారు.హైదరాబాద్ శ్రీశైలం రహదారి లో రద్దీ పెరిగిందని, ఇటీవల కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరి ని కలిసి ఈ రహదారి విస్తరణ కు నిధులు కేటాంచాలని కోరినట్లు సీఎం పేర్కొన్నారు.నేను చదువుకున్న తాండ్ర పాఠశాలను రూ.5 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. కడ్తాల సమీపంలో ని ముచ్చెర్ల ప్రాంతంలో ఆగస్టు ఒకటిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని,ఈ యూనివర్సిటీ ఏర్పాటు తో ఈ ప్రాంత నిరుద్యోగ యువత కు ఉపాధి లభిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 50 ఎకరాల్లో రూ.100 కోట్ల వ్యయం తో ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆగస్టులోగా రైతులందరికి రుణమాఫీ చేసి తీరుతామన్నారు.రుణమాఫి చేయమని అనుకొన్న ఓ నేత సవాల్ చేశారని, ఆయన ఎద్దులా పెరిగాడని.. దుడ్డెకు ఉన్న తెలివి లేదని పరోక్షంగా హరీష్ రావు పై సెటర్లు వేశారు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం జూలైలోనే రూ.లక్ష వరకు రైతు రుణమాఫీ చేశామని,ఈ నెల 31 లోగా రూ.లక్షన్నర వరకు రుణాలు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసి తీరుతామన్నారు. ఆగస్టులోగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ పూర్తిచేస్తా మన్నారు.బీఆరెస్ నేతల్లో అధికారం కోల్పోయిన బాధ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రతిపక్షం తన బాధ్యత సరిగ్గా నిర్వహించి ఉంటే కనీసం పంచాయతీ ఎన్నికల్లోనైనా గెలిచేవారన్నారు.కానీ పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు వారికి అవకాశం ఇవ్వరన్నారు.కొడుకు, అల్లుడి పై నమ్మకం లేక అరగంట ముందే అసెంబ్లీ లోకి వచ్చి కెసిఆర్ కూర్చున్నారని, వారి కుటుంబం పైనే కెసిఆర్ కు నమ్మకం లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.కార్యకర్తలను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించే బాధ్యత నాయకులుగా మేం తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.అనంతరం కొట్ర చౌరస్తా లో మాజీ ఎంపీ, దివంగత నేత జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే లు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, శంకర్, అనిరుద్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నేతలు చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, సరిత తదితరులు పాల్గొన్నారు.