విధాత : తెలుగు రాష్ట్రాల(Telugu states)లో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తిండి ఖర్చుల భారం అమాంతంగా పెరిగిపోతుంది. వెజిటెరియన్ ఫుడ్ తీసుకునే వారికైనా..నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే వారికైనా ఈ ఖర్చుల స్ట్రోక్ తప్పడం లేదు. నిన్నమొన్నటిదాక కిలో 10రూపాయల పలికిన టమాటా ధర(Tomato price increase) ఇప్పుడు రూ.63కు పెరిగింది. ఇదే సమయంలో కిలో చికెన్ మాంసం(Chicken Prices) రూ.250నుంచి 270కి పెరిగింది. పోనిలే కోడిగుడ్లతోనైనా సరిపెట్టుకుందామనుకుంటే ఒక్కో కోడిగుడ్డు(Egg Price Hike) రూ.8రూపాయల ధర పలుకుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూరగాయలతో పాటు కోడిగుడ్డు ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చలికాలం(Winter Season)లోనూ చెమటలు పట్టిస్తున్నాయి.
ఒక్కో గుడ్డు రూ.8
కార్తీక మాసం వరకు అదుపులోనే ఉన్న చికెన్, కోడిగుడ్డు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అప్పటిదాక ఒక్కో గుడ్డు రూ.5 నుంచి రూ6వరకు ఉండగా..కార్తీక మాసం ముగిసిన వెంటనే ఒక్క గుడ్డు ధర 8రూపాయలు దాటిపోతుంది.దీంతో కోడిగుడ్డు కొనడానికి సామాన్య, మధ్య తరగతి ప్రజలు వెనకడుగు వేయాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు కోడిగుడ్ల ధరలు రోజురోజుకూ పెరుగుతండటంతో.. పాఠశాల, హాస్టల్ విద్యార్థులకు కోడిగుడ్లు అందించడం భారంగా మారిందని మధ్యాహ్న భోజన ఏజెన్సీలు వాపోతున్నాయి. కోడిగుడ్డు ధరల పెరుగుదలకు చలికాలంలో ఫౌల్ట్రీ రంగంలో తగ్గిపోయే కోడిగుడ్ల దిగుబడితో పాటు నార్త్ ఇండియాలో గుడ్ల వినియోగం కూడా కారణమంటున్నారు మార్కెట్ నిపుణులు. ఏపీ, తెలంగాణలో ఫౌల్ట్రీలలోని కోళ్లు వ్యాధులతో పెద్ద సంఖ్యలో చనిపోతుండటం..చలికి కోళ్లు గుడ్లను పెట్టడం తగ్గించనుండటంతో గుడ్ల ఉత్పత్తికి..డిమాండ్ కు మధ్య వ్యత్యాసరం పెరిగి.. గుడ్ల ధర కొండెక్కాయని ఫౌల్ట్రీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
