Journalist Arrest| మహిళలను అవమానించే కథనాలు ఆమోదయోగ్యం కాదు: సీపీ సజ్జనార్‌

మహిళా అధికారిణీల వ్యక్తిత్వాన్ని అవమానించే మీడియా కథనాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని..దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మీడియా ద్వారా మహిళల ప్రతిష్ఠను దెబ్బతీయడాన్ని ఖండించాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు.

విధాత, హైదరాబాద్: మహిళా అధికారిణీల వ్యక్తిత్వాన్ని అవమానించే మీడియా కథనాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని..దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మీడియా ద్వారా మహిళల ప్రతిష్ఠను దెబ్బతీయడాన్ని ఖండించాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు.‘‘ప్రజా జీవితంలో మహిళలను అవమానించడం క్రూరత్వం. మహిళా ఉద్యోగులపై వ్యక్తిగత దాడులు ఆమోదయోగ్యం కాదు. వ్యక్తిత్వంపై దాడి అంటే వారి పురోగతిపై దాడి చేసినట్టే. స్త్రీలను గౌరవించని సమాజం భవిష్యత్తు దెబ్బతింటుంది. భవిష్యత్తు అంతా మహిళలదే’’ అని సజ్జనార్ పేర్కొన్నారు. టీవీ ఛానెల్‌ సీఈవో ఎక్కడ ఉన్నారు? పిలిస్తే.. విచారణకు రాకుండా ఆయనతో పాటు రిపోర్టర్లు ఎందుకు పారిపోతున్నారు అని ప్రశ్నించారు. అప్పటికప్పుడు ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేసుకుని బ్యాంకాక్‌ పారిపోయేందుకు ప్రయత్నిస్తేనే అదుపులోకి తీసుకున్నాం. మరో రిపోర్టర్‌ విచారణకు వస్తానని చెప్పి సెల్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. అందుకే వారిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నాం అని సజ్జనార్ వెల్లడించారు.

ఎన్టీవీ ఆఫీస్ లో పోలీసుల సోదాలు

మహిళా ఐఏఎస్ అధికారిణీలపై ప్రసారమైన కథనం కేసులో ఎన్టీవీ ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్ ను అదుపులోకి తీసుకున్న సిట్ పోలీసులు..ముగ్గురిని సీసీఎస్ లో విచారించారు. విచారణ అనంతరం చారిని పంపించారు. మరోవైపు పోలీసులు ఎన్టీవీ ఆఫీస్ కు వెళ్లి సెర్చ్‌ వారెంట్‌ లేకుండానే సోదాలు నిర్వహించడం వివాదస్పదమైంది. ఎన్టీవీ కార్యాలయంలోని కంప్యూటర్‌లను, సర్వర్‌ రూమ్‌ను సీజ్‌ చేస్తామన్న వ్యాఖ్యలతో కొంత గందరగోళం నెలకొంది. అయితే విచారణకు సహకరించాలని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఎన్టీవీ ఉద్యోగులు అరెస్టు..సోదాల సందర్భంగా వివాదానికి కారణమైన ఆఫ్ ది రికార్డు కథనం ప్రసారానికి బాధ్యులను గుర్తించే పనిలో ఉన్నామని సజ్జనార్ తెలిపారు.

జర్నలిస్టుల అరెస్టులను ఖండించిన బీఆర్ఎస్ నేతలు

ఎన్టీవీ కార్యాలయంలో పోలీసుల సోదాలు, పండుగ వేళ, అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్టులపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు అన్నారు. మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా? అని ప్రశ్నించారు. జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం పై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడిగా పేర్కొన్నారు.

జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియా పై సిట్లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? అని, మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గం అని, రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన?
ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అని హరీష్ రావు ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

రాహుల్ గాంధీకి కేటీఆర్ ట్వీట్

ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు. మొహబ్బత్ కీ దుకాణ్ అంటే ఇదేనా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం జర్నలిస్టుల అరెస్టులను ఖండించారు.

కాంగ్రెస్ నుంచి భిన్న స్పందనలు

ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులపై అధికార కాంగ్రెస్ లో భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఓ వైపు మహిళా అధికారులు, మంత్రులను అవమానించే కథనాలను తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో జర్నలిస్టులను అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదు అని జగ్గారెడ్డి హితవు పలికారు.

Latest News